Wednesday, October 17, 2018

విజయనగరం సంగీత కళాశాల స్థాపన నేపథ్యము – శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారి అధ్యక్ష నియామకము


దక్షిణ భారతావని ప్రప్రథమ సంగీత పాఠశాల శ్రీ విజయరామ గాన పాఠశాల (ఈనాటి మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ) స్థాపన, ఆ కళాశాలకు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారి అధ్యక్ష నియామకం ఒక ప్రత్యేక నేపధ్యంలో జరిగింది. ఆ నేపధ్యాన్ని, దానికి గల ఆసక్తికరమైన కారణాలను ఎంతోమంది సంగీత, సాహిత్య విద్వాంసులు తమ రచనలలో వివరించారు. అటువంటి ప్రముఖులలో నారాయణ దాసుగారి కాలంలో వారితో ప్రత్యక్ష పరిచయము, సంబంధము గల ప్రముఖులు: సుప్రసిద్ధ కవి, అష్టావధాని, సాహితీవేత్త శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు; సుప్రసిద్ధ వైణిక విద్వాంసులు వైణిక శిరోమణి’, ‘వైణిక రత్న’, ‘వీణా విద్యాధర’, ‘వైణిక రత్నాకర శ్రీ వాసా కృష్ణమూర్తి గారు (వీరి తండ్రి శ్రీ వాసా వేంకట రావు గారు నారాయణ దాసుగారు అధ్యక్షత వహించిన సంగీత కళాశాల, ‘శ్రీ విజయరామ గాన పాఠశాలలో వైణిక విద్యాచార్యులు); ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారు; నారాయణ దాసుగారి జీవితచరిత్ర కారులు శ్రీ మరువాడ వేంకట చయనులు గారు మరియు శ్రీ వసంతరావు బ్రహ్మాజీ రావు గారు. అదే విధంగా ఆ తరువాతి కాలంలో సాహిత్య పరిశోధకులు, విమర్శకులు ఆ కళాశాల స్థాపన నేపధ్యపు చరిత్రను వారి రచనలలో ప్రస్తావించారు. వీరిలో ప్రముఖులు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు ఆచార్యులు, దాసభారతి ప్రచురణల సంపాదకులు డా. ఎస్. వి. జోగారావు గారు; డా. గుండవరపు లక్ష్మీనారాయణ గారు (వీరు నారాయణ దాస సాహిత్యంపై సమర్పించిన సమగ్ర పరిశోధన వ్యాసం. నారాయణ దర్శనము గ్రంథమునకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పి. ఎచ్. డి. పట్టా ప్రదానం చేసింది); బ్రాహ్మీభూషణ శ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు; శ్రీ ఆర్. వి. ఎన్. సుబ్బా రావు గారు; . ఎం. ఎ ఎల్. కళాశాల, అనకాపల్లి, ఆంగ్లోపన్యాసకులు, ఆంగ్లంలో శ్రీ నారాయణ దాసు గారి జీవితచరిత్ర రచయిత డా. గంటి శ్రీరామ మూర్తి గారు; దాస భారతి ప్రచురణల సంపాదకులు శ్రీ కర్రా ఈశ్వర రావు గారు; ఆర్. వి. ఆర్. బి. ఈడీ. కళాశాల, గుంటూరు ఆంధ్రోపన్యాసకులు, రచయిత, సాహిత్య విమర్శకులు, శ్రీ నారాయణ దాస స్వీయ చరిత్ర నా యెఱుక సంపాదకులు డా. మోదుగుల రవికృష్ణ గారు; శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి హరికథా విభాగ పూర్వ అధ్యక్షులు డా. ఎచ్. ఎస్. బ్రహ్మానంద గారు మొదలైనవారు. 

కర్ణాటక-హిందుస్తానీ సంకీర్ణ బాణీ రూపకల్పననారాయణ దాసుగారు ఏకసంతగ్రాహి. నీరు భూమిలో ఇంకినట్టు ఆయన విద్యలను అంతర్గతం చేసుకునేవారు. విజయనగర రాజాస్థానంలో మొహబ్బత్ ఖాన్ అనే హిందుస్తానీ సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అయన సాంగత్యంలో దాసుగారు హిందుస్తానీ సంగీత బాణీని ఆకళింపు చేసుకున్నారు. దానితోఅప్పటికే కర్నాటక సంగీతంలో ప్రావీణ్యం ఉన్న అయన అనుసరణలోఆ రెండు సంప్రదాయాల మేలుకలయికగాఒక కొత్త సంప్రదాయం, ‘కర్ణాటక-హిందుస్తానీ సంగీతాల సంకీర్ణ బాణీ’ వెలువడింది. 

కాలక్రమేణా నారాయణ దాసుగారు విజయనగర సంగీత కళాశాలకు ప్రిన్సిపలుగా  నియమితులయినపుడుఆయన రూపకల్పన చేసిన ‘కర్ణాటక హిందుస్తానీ సంగీతాల సంకీర్ణ బాణీ’ ఆ కళాశాల పాఠ్యప్రణాళికలో భాగం అయింది. విజయనగరం సంగీత కళాశాలలో సంగీత విద్యనభ్యసించిన విద్వాంసులు ఈనాటికీ ఆ బాణీని అనుసరిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఆ సంప్రదాయానికి నారాయణ దాసుగారే ఆద్యుడనే గుర్తింపు రాలేదు. దానిని 'విజయనగరం సంగీత బాణీ'గా పిలుస్తారు.

శ్రీ నారాయణ దాసు గారు తమ సంగీత సాహిత్య జైత్ర యాత్ర 1883లో తొలి హరికథా ప్రదర్శనతో ప్రారంభించారు. అప్పటినుండి తూర్పున బ్రహ్మపురం (బరంపురం) వరకు దక్షిణాన మచిలీపట్టణం వరకు అనేక నగరాలలోను, జమిందారీ సంస్థానాలలోను అష్టావధానాలు, సంగీత కచేరిలు మరియు హరికథా ప్రదర్శనలు జరిపి పండిత ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత 1894లో మదరాసులోను, మైసూరు మహారాజావారి ఆస్థానంలోను తమ సంగీత వైదుష్యముతోను, హరికథ ప్రదర్శన కౌశలముతోను అద్భుతమైన సన్మానాలను, పత్రికా ప్రశంలను అందుకొన్నారు. కానీ అంతవరకు విజయనగర ప్రభువుల ఆస్థానంలో వారికి ప్రవేశం లభించలేదు. దానికి కారణం అసూయాపరులైన ఆస్థాన విద్వాంసులు వారి విజయాలను ప్రభువుల దృష్టికి తీసుకొని రాకపోవడమే. అయితే నిజం ఎంతకాలం దాగుతుంది? మదరాసు, మైసూరులలో వారి సంగీత కచేరీలను హరికథా ప్రదర్శనలను ది హిందూది మెయిల్ వంటి పత్రికలు అనన్య సాధ్యమైన నేర్పుగా  ప్రశంసిస్తూ సమీక్షా వ్యాసాలు ప్రచురించాయి. అందులో ముఖ్యంగా జూన్ 30, 1894ది హిందూ ప్రచురించిన సమీక్షలో ఈ భాగం పేర్కొనదగినది:
   
అనన్య సాధ్యమైన నేర్పున నీ విజయనగర విఖ్యాతుడు హరికథా గానము సేయుచుండగా సభలో నున్న వారందరును సంతోషాతిశయమున మైమరచి అడుగడుగునా నాతని మెచ్చుకొనుటయే కాక, హరికథాంతమున అరుదగుఁ గొప్ప విశిష్టానుభూతి లభించెనని యొక్క పెట్టున నన్ని మూలాల నుండి జనములు శ్లాఘించిరి. అతడు పండితాగ్రేసరుడని గొప్ప పండితులచేతను, అతి మనోహరమగు పాటకుడని సంగీతజ్ఞులగు గాన ప్రియుల చేతను, వక్తృత్వ విశారదుడని వక్తలచేతను వేనోళ్ళ పొగడబడుట కర్హుడు.” (మరువాడ, 1959: 87)

దాసుగారు బెంగుళూరు పర్యటననుండి విజయనగరం తిరిగి రాగానే ఆనంద గజపతి మహారాజావారి ఆదేశంతో, ఆయన పేరు ఆస్థాన విద్వాంసుల జాబితాలో చేర్చబడింది. కొంతకాలం తరువాత మహారాజుగారి గురుతుల్యుడైన లింగం లక్ష్మాజీ పంతులుగారి ప్రోద్బలముతో రాజసందర్శనం జరిగింది. ఒకసారి పండిత సభలో రాజావారు "సతతము సంతసమొసంగు సత్యవ్రతికిన్" అను మకుటంతో పద్యం చెప్పమని కోరగా దాసుగారు ఆశువుగా నూరు పద్యములు చెప్పి శతకం పూర్తిచేశారు. సత్యవ్రతి శతకం అనే ఆ శతకాన్ని విజయనగరం రాజాస్థానమే ప్రథమంగా ముద్రించింది. ఆనందగజపతి ప్రభువువారు దాసుగారి గాత్రము కోటా పేటా పట్టవనిన్నూఅందరికీ ఒక కన్నే ఉన్నది కానీ దాసుగారికి సంగీత, సాహిత్యములను రెండు కన్నులున్నవనియు వారివలె సంగీతము పాడగల్గు వారుగాని, కవిత్వము చెప్పగలగువారు గాని, నీయూర లేరనియు బాహాటంగా చెపుతూ ఉండేవారు. దాసుగారి ప్రతిభను గుర్తించిన రాజావారు వారిని కేవలము ఆస్థాన సేవకుడిగా కాక సన్నిహితుడుగా, ఆంతరంగికునిగా పరిగణించేవారు.

ఆనందగజపతి రాజుగారు 1897వ సంవత్సరంలో మరణించిన తరువాత విజయనగరం సంస్థానం వారసత్వ వ్యాజ్యంలో చిక్కుకుని, బ్రిటిషు ప్రభత్వం నియమించిన Court of wards యాజమాన్యంలోనికి వెళ్ళింది. ఆ కారణంగా 1897–1910 సంవత్సరాల మధ్యకాలంలో విజయనగరం ఆస్థాన కార్య కలాపాలన్నీ స్తంభించిపోయాయి. దాసుగారి పండిత వేతనం నిలిపివేయబడింది. అయితే దాసుగారందుకు చింతించలేదు. ఆయన సంగీత, సాహిత్య యాత్రలు, రచనా వ్యాసంగము యధావిధిగా సాగుతూనే ఉన్నాయి. ఆ కాలంలో ప్రహ్లాద చరిత్ర (1898), భీష్మ చరిత్ర, ‘సావిత్రి చరిత్ర (1902), ‘తారకం (1910), హరికథామృతము (మూడు సంస్కృత హరికథల సంపుటి), ‘కాశీ శతకం (1914) మొదలగు గ్రంథములు రచించారు. బెంగుళూరులో 1904లో జరిగిన దాక్షిణాత్య గాయక మహాసభవార్షికోత్సవంలో రుక్మిణి కళ్యాణం హరికథా గానం చేస్తూ వారు ప్రదర్శించిన అనితర సాధ్యమైన లయజ్ఞాన ప్రతిభకు గుర్తింపుగా ఆ మహా సభ లయబ్రహ్మ అనే బిరుదును సమర్పించింది. రాజమహేంద్రవరంలో 1911-12లో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి అధ్యక్షతన జరిగిన విద్వత్సభ నవరత్న ఖచిత భుజ కీర్తిని సమర్పించింది. మహారాణి అప్పల కొండయాంబ (రీవా రాణి) వారి సన్మానం 1912 సంవత్సరంలలో అందుకున్నారు.

కలకత్తాలో 1913వ సంవత్సరంలో శ్రీకృష్ణ జననం సంస్కృత హరికథ ప్రదర్శించి శ్రీ రబీంద్రనాథ్ టాగోర్ ప్రశంసలు అందుకున్నారు. నారాయణ దాసు గారి అద్భుత గానానికి ముగ్ధులైన గురుదేవులు మీరు ఈ సంగీతం ఎవరివద్ద అభ్యసించారు? అని అడిగారు. దానికి దాసు గారు చిరునవ్వుతో దేవునిదగ్గర అని సమాధానం ఇచ్చారు. ఆ ఇరువురు మహనీయుల పునస్సమాగమం సుమారు పది సంవత్సరాల తరువాత విజయనగరంలో జరిగింది. అప్పటికి నారాయణ దాసుగారు శ్రీ విజయరామ గాన పాఠశాల అధ్యక్షులు. కుశలప్రశ్నల తరువాత శ్రీ టాగోర్ ఆనాడు మీరు గానం చేసిన బేహాగ్ రాగం ఇంకా నా చెవులలో మారుమ్రోగుతోంది అని చెప్పి మీ కళాశాలలో అనుసరిస్తూన్న పాఠ్య ప్రణాళిక ఇవ్వండి విశ్వ భారతి విశ్వవిద్యాలయంలో ప్రవేశపెడతాము అని కోరారు.  శ్రీ టాగోర్ రూపకల్పన చేసిన రబీంద్ర సంగీత్  ఇంచుమించుగా, శ్రీ నారాయణ దాసు గారి కర్ణాటక హిందుస్తానీ బాణీల సంకీర్ణం లాంటిదే. అయితే దానికి స్ఫూర్తి కూడా దాసు గారి సంకీర్ణ బాణీయేనా? 

వారి వీణా వాదన ప్రతిభకు గుర్తింపుగా 1914 సంవత్సరంలో చల్లపల్లి జమీందారు, రాజా అంకినీడు మల్లికార్జున ప్రసాదు గారిచే గండపెండేరం సన్మానం అందుకున్నారు. భార్యా వియోగం తరువాత యథార్థ రామాయణంఅనే ఆరు రామాయణ కథల సంపుటిని 1915లో రచించి, ఆ గ్రంథాన్ని ఆమెకు అంకితమిచ్చారు. తెలుగు సాహితీ ప్రపంచంపై యథార్థ రామాయణం వేసిన చెరగని ముద్ర కారణంగా ఆ గ్రంథంలోని  సమాసాలు, పద్య పంక్తులు సాహిత్య ప్రయోగాలుగా ఈనాటికీ వర్ధిల్లుతున్నాయి. జనానీకమున భక్తి సద్భావ సంపదను, కళారాసిక్యమును పెంపొందించుచున్న యథార్థ రామాయణంహరికథ అటు నారాయణ దాసుగారి కళాసృష్టి హరికథ ప్రపంచంలోనూ ధ్రువ తారగా విలసిల్లింది.  
         
ఆ నేపథ్యంలో (అందులోనూ ఆనంద గజపతి మహారాజుగారి మరణాంతరం పండిత వేతనం నిలిపివేయబడటం, నారాయణ దాసుగారికి విజయనగరం సంస్థానం ద్వారా అసంకల్పితంగానైనా జరిగిన లోపంగా భావించి), వారిని ఎలాగేనా చిరస్థాయిగా నిలిచేలా గౌరవించాలని విజయనగర ప్రభువులు, శ్రీ విజయరామ రాజు, ఆయన సతీమణి శ్రీమతి లలిత కుమారీ దేవి భావించారు.

శ్రీమతి లలిత కుమారీ దేవి శ్రీ నారాయణ దాసుగారు రచించిన రుబాయియత్ ఆఫ్ ఒమర్ ఖైయంను అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిచే ముందు మాట వ్రాయించి, 1922లో ప్రచురించారు. ఈ అపూర్వ గ్రంధము, పర్షియను మూలము, పర్షియను లిపికి ఉచ్చారణ సంకేతాలతో ఆంగ్ల భాషాంతరీకరణము, ఆంగ్లము, సంస్కృతము, తెలుగు భాషలలో ముద్రించబడినది. దానిని దాసుగారితో సహా ఆమె అప్పటికి దివంగతులయిన శ్రీ విజయరామ రాజు మహారాజుగారికి అంకితమిచ్చారు.

శ్రీ విజయరామ రాజుగారు తమ ఆంతరంగిక మిత్రులు శ్రీ కానుకుర్తి నరసింగరావు గారితో అలోచించి ఒక సంగీత కళాశాలను స్థాపించి దానికి నారాయణ దాసుగారిని అధ్యక్షులుగా నియమిస్తే వారిని ఉచిత రీతిన గౌరవించినట్లవుతుందని భావించారు. నారాయణ దాసుగారిని ఆహ్వానించి ఆ విషయం ప్రస్తావించారు. అయితే నారాయణ దాసుగారు తనకు అప్పటికే 55 ఏళ్ళ వయసని సాధారణంగా ఉద్యోగులు పదవీ విరమణ చేసే వయసుకు తనకు ఉద్యోగంలో చేరే ఉద్దేశం లేదనీ, పైగా తనకు మానవమాత్రుల వద్ద ఉద్యోగం చెయ్యనని నియమం ఉందని సున్నితంగా తిరస్కరించారు. మహరాజా వారు తమ పట్టు విడువక అసలు కాలేజీ స్థాపన వారిని గౌరవించడానికేననీ, దాసుగారు తనకు ఇష్టం వచ్చినన్నాళ్లు ఉద్యోగం చెయ్యవచ్చుననిన్నీ, పదవీ విరమణ తరువాత కూడా అప్పటి జీతాన్ని పింఛనుగా పొందవచ్చునని నచ్చచెప్పి ఒప్పించారు. చివరకు దాసుగారు సంగీత కళాశాలను శ్రీరాముని కోవెలగా భావించి తాను రామ సేవకునిగా పని చేస్తానని అంగీకరించారు. అందుకు సంకేతంగా తాను పదవీ బాధ్యతలు స్వీకరించే రోజున శ్రీరామ పట్టాభిషేకం పటం పట్టుకుని కళాశాలలో అడుగు పెట్టారు. ఆ విధంగా ఆ కళాశాల ఫిబ్రవరి 5, 1919 తేదీన ప్రారంభించబడింది  
         
శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు నారాయణ దాసు గారి మరణాంతరం వారికీ స్మృత్యంజలిగా 1945, జనవరి 13 తేదీ ఆంధ్రవాణి పత్రికలో వ్రాసిన వ్యాసంలో ఈ విధంగా చెప్పారు:   

విజయనగరంలో అప్పుడు సర్వ విద్యలూ తాండవిస్తూ ఉండేవి. ఈ వరప్రసాదునకు (నారాయణ దాసుగారికి) శ్రుతి మాత్రంచేత అవన్నీ స్వాధీనపడ్డాయి. వీణ [వాదనము] గురుశుశ్రూష వినాగా లభించదని నాకు తోస్తుంది. ఈయనకు ఆ విద్యకూడా అలాగ స్వాధీన పడ్డది.  ఆ సంస్థాన ప్రభువులు యీ యన్ని ఎలా గౌరవించవలెనో ఆ విధంగా గౌరవించి చరితార్థులైనారు. సంగీత పాఠశాల ప్రధానాధికారిగా నేర్పరచి పూజించినారు.
   
శ్రీ చెళ్ళపిళ్ళ వారి వ్యాసం చీరాల సంస్కృతీ సమితి ప్రచురించిన హరికథా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస జయంత్యుత్సవ సంచిక’ (1967:207), గుంటూరు రచయితల సంఘము ప్రచురించిన శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనము (1974:91)లలోను పునర్ముద్రించారు. అదే గ్రంధంలో శ్రీ వాసా కృష్ణమూర్తి గారు దాసుగారి సంగీత గురుత్వమును ప్రశంసిస్తూ వ్రాసిన వ్యాసంలో సంగీత కళాశాల విషయం ప్రస్తావించారు:

శ్రీ దాసుగారు సంగీతము నందపార ప్రజ్ఞాధురంధరులు. వారేది పట్టినా అది అపరంజిగా మారిపోయేది. వారి నడకలో తాళం, వారి నిత్య జీవితం సంగీతం. వారే సంగీతం అంటే బాగుంటుందేమో! కానుకుర్తి నరసింగరావుగారు శ్రీ విజయరామరాజులవారిని కలసి వారితో ఒక సంగీత కళాశాలను దాసుగారి ప్రిన్సిపలు పదవిక్రింద స్థాపించి మన విజయనగర కీర్తిని చిరస్థాయిగా నుండేటట్లు చేయమని కోరగా, వెంటనే రాజావారందులకంగీకరించి 1919లో ఏర్పాటు చేసిరి. ఆనాడు మద్రాసు మొదలు కలకత్తా వరకూ ఎక్కడా సంగీత పాఠశాల అనేది లేనేలేదు. ఒక్క విజయనగరంలో మాత్రమే యుండేది.” (వాసా కృష్ణమూర్తి, 1974:1151)  

శ్రీ మరువాడ వేంకట చయనులు గారు రచించిన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస జీవిత చరిత్రములో ఈ అంశంపై ఒక అధ్యాయము (ఎనిమిదవ అధ్యాయము) ప్రత్యేకముగా సంగీత కళాశాల స్థాపన విశేషాలను విశదీకరిస్తుంది. దాని ప్రకారము ఆ కళాశాల స్థాపన వారిని అధ్యక్షులుగా నియమించుటకు జరిగింది; అంతేకాక మిగిలిన ఉద్యోగుల నియామకాల వలె కాక నిబంధనారహితంగా జరిగింది:  

శ్రీ విజయనగర మహారాజు కుటుంబము విద్యాపోషకులని ప్రసిద్ధిగాంచెను. చిరకాలము క్రిందటనే కాలేజియును, సంస్కృత పాఠశాలయు, వేదపాఠశాలయు నెలకొల్పబడి కొనసాగు చుండెను. సంగీతము విషయములో కొందరు విద్వాంసులు తమ యిండ్లలో నల్గురైదుగురు శిష్యులకు బోధించు చుండుటయే కానీ ఆంధ్రదేశమం దెచ్చటను సంగీతపాఠశాల నెలకొల్ప బడలేదు. ఆలోటు తీర్చనెంచి శ్రీ కానుకుర్తి నరసింగరావుగారి ప్రోత్సాహమున శ్రీ విజయరామ గజపతి మహారాజుగారు శ్రీ విజయరామ గానపాఠశాలను నెలకొల్పి శ్రీ నారాయణదాసు గారిని పిలిపించి ఆ పాఠశాలకు ప్రిన్సిపలుగా నుండు డనియు తగిన ఉపాధ్యాయులను నియమించు డనియు కోరిరి. పాఠశాల నెలకొల్పబడుటకు సంతోషించి శ్రీ దాసుగారు తన కప్పటికే ఏబది యైదేండ్లు న్నవనియు, ఉద్యోగములో నున్నయెడల విరమించ వలసిన వయసు వచ్చినదనియు, ఎన్నాళ్ళు పనిచేయ గలననియు, ఉద్యోగవాంఛ తన కెన్నడూ లేదనియు మనవి చేసిరి. అప్పుడా ప్రభువు మీరు ప్రిన్సిపలుగా నున్న యెడల మీ ప్రఖ్యాతివల్ల పాఠశాలయు నభివృద్ధి పొందునని యెంచి మిమ్ములను కోరినాము. మీ యిష్టము వచ్చినన్నాళ్లు ప్రిన్సిపలు పదవి నిర్వహించి మీ యిష్టము చొప్పున విరమించ వచ్చును. మీకు నెలకు నూరు రూపాయలు ఆజన్మాంతము యిచ్చెద మనిరి. మరియు మిమ్మెవరైన హరికథల కావాహ్వానించునెడల వెళ్ళుట కెట్టి యభ్యంతరము ఉండదు అని చెప్పి దాసుగారి నొప్పించెను. (1959: 141-142)

ఈ వ్యాసంలో పైన పేర్కొన్న ప్రముఖులలో నారాయణ దాసుగారి జీవితకాలంలో వారితో సంబంధము నెరిపిన సాహితీ వేత్తలలో ఒకరు శ్రీ యామిజాల పద్మనాభ స్వామిగారు. అయన రచించిన దాసుగారి జీవిత చరిత్ర పూర్ణ పురుషుడులో అనేక ఆసక్తికరమైన విశేషాలను వివరించారు. అందులో సంగీత కళాశాల స్థాపన నేపథ్యము, దానిపై నారాయణ దాసుగారుపద్మనాభ స్వామిగార్ల మధ్య జరిగిన సంభాషణను పేర్కొన్నారు:

విజయనగర సంస్థానాధీశులు దాసుగారి సంగీత, సాహిత్య సామ్రాజ్య వైభవానికి జోహార్లర్పిస్తూ శ్రీ విజయ రామ గాన కళాశాలను స్థాపించి దానికి అధ్యక్షులుగా ఉండి సంగీత వైభవాన్ని విద్యార్ధి లోకానికి వ్యాపింప చేయవలసిందిగా అర్థించారు. తమ స్వతంత్ర ప్రవృత్తికి ఆ అధ్యక్ష పదవి అడ్డు రాకూడదనే నియమమును ప్రకటించి అలాగే ఆ పదవి 1919 నుంచి 1936 వరకు ఇరవై సంవత్సరాలు జగజ్జగేయమానంగా నిర్వహించారు.

ఆ పదవిని చేపట్టిన నాటికి అయన యేభై అయిదేళ్ల యువకుడుగా నేను ఒకమారు సామాన్య ధోరణిలో చమత్కరించగా కాదురా నీకు లెక్కలు రావు. నేను అప్పటికి పదేళ్లవాణ్ణి’ – అని చిరునవ్వుతో నామాట త్రోసిపుచ్చారు. అర్థం చేసుకుని అవునన్నాను. అయన అంతతో ఊరుకున్నారా? ‘ఒరే తాతా, అందరూ ఉద్యోగంనుంచి విశ్రాంతి తీసుకునే వయస్సుకి విజయనగరం సంస్థానం వారు నాకు ఉద్యోగం ఇచ్చారు. అప్పటికి తెలిసింది వారికీ నేను ఎవణ్ణో!అని గట్టిగా నవ్వారు. విచిత్రమేఅన్నాను నేను. విచిత్రం అనేది నా జీవితంలో లేదు. అంతా సహజమే నాకు. ఇంట గెల్చి రచ్చ గెలవమన్న సామెత నాపట్ల తారుమారయింది. మైసూరూ, మద్రాసూ, గుంటూరు, గుడివాడా ఇలా పై ప్రదేశాలలో నేను విజయభేరి మ్రోగించాక విజయనగరము సంస్థానములో సన్మానము పొందాను. అంటే ఏమిటర్ధం? రచ్చ గెల్చి ఇంట గెల్చానన్నమాట ...

ఆ మహానుభావుడు తన వేదవిద్వత్తును వెల్లడిచేస్తూ ఋగ్వేదం నుంచి కొన్ని సూక్తాలను ఏరి 'మ్రొక్కుబడి' అనే పేరుతో తెనుగు చేశారు. ఆ ఋగ్వేద సూత్రాలను కొన్నిటిని స్వరపరచి సంగీత కళాశాల విద్యార్థులకు వీణపై సాధన చేయిస్తూ ప్రార్థన గీతాలుగా పాడించేవారు. (వారి) పదవీ విరమణ అయ్యేవరకూ ఈ నియమం నిత్యమూ జరిగింది.” (పూర్ణ పురుషుడు, రెండవ సంకలనము, 1979: 111-112)

బ్రాహ్మీభూషణ శ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు శ్రీ నారాయణ దాసు గారి ఒమర్ ఖైయం రుబాయిల  సంస్కృతాంధ్ర అనువాదాలను సమీక్షిస్తూ శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనం గ్రంధములో ఉమర్ కైయాము రుబాయతు అనే వ్యాసం వ్రాసారు. అందులో సంగీత కళాశాల స్థాపన విషయం ప్రస్తావించారు:

ఈ గ్రంధము [రుబాయియత్ ఆఫ్ ఒమర్ ఖైయం] 1930 ప్రాంతమున విరచితము. 1932 లో ప్రకటితము. విజయనగర ప్రభువు, దాసుగారిలో వేంచేసియున్న సరస్వతిని సత్కరించుటకై  సంగీత కళాశాలను స్థాపించి వారిని ప్రప్రధమాధ్యక్షులను చేసి గౌరవించిన శ్రీ విజయరామగజపతి మహారాజుగారికి అంకితము.  (పు. 707)

ఈ విషయంపై తమ రచనలలో ప్రస్తావించిన రచయితల ఉల్లేఖనముల పట్టిక కింద నివ్వబడింది. అందులో ముఖ్యమైన ఒక వివరణను ఈక్రింద పొందుపరుస్తున్నాను:

విజయరామ గజపతీంద్రుడు విజయనగరమున గాన కళాశాలను స్థాపించవలయుననియు, దానికి దాసుగారే ప్రిన్సిపాలుగ నుండవలయుననియు సంకల్పించి దాసుగారికి చెప్పెను. గానకళాశాల స్థాపించుట నాకు చాల ఆనంద ప్రదము. రిటైరు అగు వయసుననున్న నేను దానికి ప్రిన్సిపాలుగ నుండజాలనని దాసుగారు ప్రభువుతో ననిరి. మీ కీర్తిప్రతిష్టల వలన కళాశాల అభివృద్ధి నందునని కళాశాల నేర్పరచుచున్నాము కళాశాల కొరకు మీరుగాని మీకొరకు కళాశాలకాదు అని ప్రభువు పెక్కు విధముల చెప్పగా దాసుగారు అందుల కొప్పుకొనిరి. మహారాజావారు మరల దాసుగారితో మీ హరికథా ప్రచారము యథాపూర్వయుగ సాగవచ్చును. మీకు ఇష్టము వచ్చినంతకాల ముద్యోగము చేయవచ్చును ...” (కర్రా ఈశ్వరరావు, 1974: 49)

ఉల్లేఖనములు / సహకార గ్రంధములు

ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి. 2014. పూర్ణ పురుషుడుశ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు. హరికథా పితామహ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస సాహితీవైభవం. (శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస 149వ జయంత్యుత్సవ సంచిక.) తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. పుటలు 70-85.
కర్రా, ఈశ్వర రావు. 1974. జీవితోదంతము”. ఎస్. వి. జోగా రావు (సం.). శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనము. రచయితల సహకార సంఘము. గుంటూరు. పుటలు 49-56.
గుండవరపు, లక్ష్మీనారాయణ. 1983. నారాయణ దర్శనము (పిఎచ్. డి. పరిశోధన గ్రంధము). పద్మిని ప్రింటర్స్. గుంటూరు. పు. 28
చెళ్ళపిళ్ళ, వేంకట శాస్త్రి. 1945. “కీ. శే. ఆదిభట్ల నారాయణ దాసు. ఆంధ్రవాణి జనవరి 13, 1945. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస శత జయంత్యుత్సవ సంచిక. 1967. సంస్కృతీ సమితి. చీరాల. పుటలు 207-208.
------------------------- 1945. “సకల కళా ప్రపూర్ణుడు”. ఆంధ్రవాణి జనవరి 13, 1945. ఎస్. వి. జోగా రావు (సం.). 1974. శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనము. రచయితల సహకార సంఘము. గుంటూరు. పుటలు 90-91
మరువాడ, వేంకట చయనులు. 1959. శ్రీమదజ్జాడాదిభట్ట నారాయణదాస జీవిత చరిత్రము. కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్. రాజమండ్రి. పుటలు: 87 మరియు 140-141
మోదుగుల, రవికృష్ణ. 2012. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు. (నాలుగవ తెలుగు ప్రపంచ మహాసభల ప్రచురణ). రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి, తెలుగు అకాడమీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. హైదరాబాదు. పు. 59
యామిజాల, పద్మనాభ స్వామి. 1979. పూర్ణ పురుషుడు. (రెండవ కూర్పు).  జాన్సన్ పబ్లిషింగ్ హౌస్. గుంటూరు. పుటలు 111-112
ఆర్. వి. ఎన్. సుబ్బారావు. 1974. మిత్రులు అభిమానులు. ఎస్. వి. జోగా రావు (సం.). శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనము. రచయితల సహకార సంఘము. గుంటూరు. పు. 163 మరియు 175.
రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి. 1974. “ఉమర్ కైయాము రుబాయతుఎస్. వి. జోగా రావు (సం.). శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనము. రచయితల సహకార సంఘము. గుంటూరు. పు. 707
వాసా, కృష్ణ మూర్తి. 1974. "దాసుగారి సంగీత గురుత్వము". ఎస్. వి. జోగా రావు (సం.). శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనము. రచయితల సహకార సంఘము. గుంటూరు. పుటలు 1151-1166
ఎస్. వి. జోగా రావు. 1974. “సంగీత చతురాస్యుడు. ఎస్. వి. జోగా రావు (సం.). శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనము. రచయితల సహకార సంఘము. గుంటూరు. పు. 1055
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస శత జయంత్యుత్సవ సంచిక. 1967. సంస్కృతీ సమితి. చీరాల. పు. 185.
ఎచ్. ఎస్. బ్రహ్మానంద. 2013. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి బహుముఖ ప్రతిభ. (శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి 150వ జయంతి సందర్బంగా ప్రచురించిన లఘు గ్రంధము). సాంస్కృతిక శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము. హైదరాబాదు. పు. 15 
Ganti, Srirama Murthy. 1985. Monarch of Rhythm (Second Edition). Jupiter Publications. Machilipatnam. pp. 101-108
Vasantarao, Brahmaji Rao. 2014. The Life of Sri Adibhatla Narayana Das. (Second Edition) N.K. Publications. pp. 39-42