శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస సాహిత్యము


ఇది శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారి రచనలలో కొన్నింటిని సూక్ష్మముగా వివరించిన పట్టిక. ఇందులో కొన్ని గ్రంధాల పేర్లు మాత్రము ఉన్నాయి. వాటిని కూడ వివరించి, సవరించిన పట్టిక త్వరలో వెలువడనుంది.  
................................................................


శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి రచనల వివరములు
శతక సాహిత్యము
1.    సూర్యనారాయణ శతకము
2.    ముకుంద శతకము ("కందళితానంద మూలకంద ముకుందా!" అను మకుటము గల ప్రతిపదసుందర, భావబంధురమైన రచన. ఇందు మహా భక్తకవియైన దాసుగారి హృదయస్పందము లనేకము విందుము. 1929కి ముందే ముద్రితము. ప్రతులు దుర్లభము. రచన: 1908)
3.    మృత్యుంజయ శివ శతకము (దాసుగారికి, వారి హరికథలలో పాట కచ్చేరీలలో సహకారాగానము చేయుచు అనేక సభలలో సెభాషనిపించుకొన్న గాంధర్వదూర్వహుడు, సర్వతంత్ర స్వతంత్రుడైన దాసుగారిని కంటికి రెప్పవలె సాకిన సహోదరుడు నైన పేరున్నగారు మృత్యు ముఖద్వారమున నున్నప్పు డా చెంగట గ్రుక్కిళ్లు మ్రింగుచున్న దాసుగారి యెడద ఏడ్చిన యేడ్పు ఈ శతకము. ఆ సహోదర సౌహార్ద మెట్లు నాన్యతోదర్శనీయమో ఈ శతకమందలి కదుష్ణ వేదనాశ్రుతి అట్లనిర్వచనీయమైనది. రచన, ముద్రణ: 1908)
4.    సత్యవ్రతి శతకము (విద్యావినోదియగు ఆనందగజపతి ప్రభువునకును పుంభావసరస్వతియగు దాసుగారికిని గల హార్దమైన అనుబంధము దొడ్డది. ఆ రసజ్ఞ ప్రభువున కంకితముగా - "సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్" అను మకుటంతో వెలసినదిది. దాసుగారి నీతి నిపుణతకును, లోకజ్ఞతకును నికషోపల మీకృతి.) 
5.    వేల్పు వంద ("రెంట త్రాగుడు తిండి మెట్టంటు వేల్పు" అను మకుటం గల సీసపద్య శతకము. ఆ మకుటమున కర్థము సింహాచలస్వామి. నారాయణ దాస స్వానుభవ మహాభాష్యమిది. వారి భక్తి భావ భాండాగారమున కెత్తిన బావుటా. లోకజ్ఞతకు పట్టిన యద్దము. రచన:1930)
6.    పంచ శతి (అయిదు తెలుగు శతకములు)
7.    శతక ద్వయము (రెండు సంస్కృత శతకములు)
స్తోత్ర సాహిత్యము
1.    తల్లి విన్కి (లలితా సహస్ర నామములకు అచ్చతెలుగు పద్య అనువాదములు. రచన 1943-45.)
2.    వెన్నుని వేయి పేర్ల వినకరి ('విష్ణు సహస్రనామ' సంకీర్తన మిది. ఆ నామముల కచ్చ తెనుగున కించి ద్వివరణాత్మకమైన అనువాదము. పద్య ఘటితము. వివిధ పద్యముల ప్రసిద్ధములైన సంస్కృత నామముల కిచ్చ వచ్చిన మచ్చున తెలుగు పేర్లు పెట్టిరి. తెలుగు లాక్షణికులు  చెప్పుటయే తప్ప తెలుగుకవులెవ్వరును ప్రయోగించని అర్థ సమవృత్తముల నుపయోగించిరి. మొదటి కూర్పు:  1927.)
3.    వేల్పు మాట (భగవద్గీత యని దీనికి నామాంతర మున్నది. కాని దాని కిది అనువాదముగాదు, మానస పుత్రిక మాత్రము. దాసుగారికి దత్త పుత్రిక. గ్రంథ మంతయు 'బడి' యను పేర మంజరి యందున్నది. చక్కని రచన. అతిగహనమైన తత్త్వము గూడ సుతిమెత్తని తేటతెలుగు పలుకుబడిలో వాటముగా అభివ్యక్తమైనది. దీనికి పీఠిక చివర దాసుగారి వ్రాయస మిట్లున్నది: ఇరువదేడంకెలలో నెద్దియైన నొక యంకెను దలంచుకొని ఈ వేల్పుమాట పొత్తములో నెద్దియైన నొక పెడ తెరచి మీది నుండి క్రింది వరకు లెక్కింపబడిన యిరువదేడు బంతులతో దాదలంచిన యంకెగల బంతి చదువుకొన్నప్పుడు తాననుకొన్న పని యేమగునో తప్పక తెలియగలదు" అని. వాసుదేవుడు తమ హృదయమునే గాక వాక్కునుగూడ ఆవేశించి యున్నాడని కాబోలు దాసుగారి విశ్వాసము. ఆ సంఖ్యానిర్దేశము గూడ సాభిప్రాయముగా నున్నట్లున్నది. రచన: 1929)
4.    మొక్కుబడి (దాసుగారు వివిధ ఋగ్వేద సూక్తములందు తమకు నచ్చినవానిని ఋక్కుల నెన్నికచేసి వానిని వీణావాదనమున కనువగునట్లు స్వరపరచి అచ్చతెలుగు పద్యములందనువాదముగూడ వెలయించిరి. అయన విజయనగరం సంగీత కళాశాలాధ్యక్షులుగా నుండిన కాలమున శిష్యుల కీ ఋగ్వీణావాదనమున శిక్షణ నిచ్చుచుండెడివారు. ఈ కృతికే 'ఋక్సంగ్రహ' మని మరియొక పేరు. రచన, ముద్రణ: 1929. దాసుగారి జాతక వివరములీ ముద్రణయందు గలవు.) 
వచన రచనలు
1.    జగజ్జ్యోతి (అష్టాదశ పురాణ సంగ్రహ సారము. రెండు సంపుటములు)
2.    నా ఎరుక (శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి స్వీయ చరిత్ర: ఇది తెలుగులో మొట్ట మొదటి స్వీయ చరిత్ర)
3.    వ్యాస పీఠము (ఇందు పూర్వభాగమున ముద్రితాముద్రితము లందుపలబ్ధములైన దాసుగారి వ్యాసములు 16 కలవు. అందెక్కువ భాగము స్వగ్రంధ పీఠికలు. అంతర్ద్రష్టము, ఆలోచనాశీలియు, ఊహాశాలియు నగు దాసుగారి వైమర్శికదృక్పథ వైశిష్ట్యమును వారిందు చేసిన  వివిధ జీవిత భాషాసారస్వత విషయ సమీక్షణమున దర్శింప గలము. ఉత్తరభాగమున వారి హరికథ లన్నిటా గల ఉత్తమ వచన రచన లేఁర్చికూర్చితిమి. ఇందొక గొప్ప సారస్వతసౌరభము గుబాళించుచున్నది. విమర్శనాత్మకమైన పూర్వ భాగమున 12 వ్యాసములును, సృజనాత్మకమైన ఉత్తరభాగమున కొద్ది పాలును దేశ్యాంధ్రఘటితములు. డా. ఎస్. వి. జోగా రావు గారి సంపాదకత్వములో ఈ గ్రంధము 1974లో ప్రచురించబడింది)
పద్యరచనలు
1.    మేలుబంతి (ఇది యొక పెద్ద చాటు ప్రబంధము. వివిధ విషయములపై తత్తద్వేళావిశేషముగా ప్రసరించిన దాసుగారి మనసునుండి బాహిరిల్లిన భావములు - దేవతలు, ప్రభువులు, మహావ్యక్తులు, విద్వద్వతంసులు, దేశము - నగరములు, సంగీతసాహిత్యములు, వర్ణనలు, హితోపదేశము, అనువాదములు, ఆశాసనములు, స్వవిషయములు, మున్నగువాని గురించి తెలుగున పద్యములు, సంస్కృతమున శ్లోకములు, అందునిందు కీర్తనలు, - ఇట్లు బహుభంగులుగా చేసిన వాలకము లిందు కాననగును. దాసుగారి హృదయమునకు నాటి తెలుగు దేశమునకును దర్పణారోపము వంటి దీ కృతి. ఇందును అచ్చతెలుగు వైసద్యవాసితము, ఆ కూర్పు కౌసల్యే పేశలము. ఒక లఘుకృతిగా ఇది 1929కి ముందే ప్రకటితము. కానీ తత్ప్రతులు లభించుటలేదు. అదిగాక తదుపరి పదునారు వత్సరముల జీవితచరిత్ర మున్నది దాసుగారికి. ఆ కాలమున వా రలవోక గావించిన యానిబద్ధ రచన లనేకములున్నవి. ఆ యన్నిటిని కలిపి యొక బృహద్గ్రంధముగా రూపొందించితిని. ఇది 1974 జనవరిలో ప్రచురించబడినది. - డా. ఎస్. వి జోగా రావు)
అనువాద రచనలు
1.    రుబాయియత్ అఫ్ ఒమర్ ఖైయం (ఒమర్ ఖైయం పర్శియన్ రుబాయీలకు వాటి ఎడ్వర్డ్ ఫిట్జ్గెరాల్డ్ ఆంగ్లానువాదములకు సంస్కృతము, అచ్చతెలుగులలో అనువాదములు. తులనాత్మక పరిశీలన)
2.    నవరస తరంగిణి (కాళిదాసు, షేక్స్పియర్ రచనలలో నవ రస పోషణల తులనాత్మక పరిశీలన గ్రంధము)
3.    నూరు గంటి  (ఈసపు నీతికథల నొక నూటి నేర్చి కూర్చిన కృతి. బాలాపబోధమునకై సద్యః ప్రసన్నమగు భాషలో గద్య ఘటిత మైనట్టిది. ప్రతి కథాంతమందును ఒక చిన్న పద్యమున కథాంశాపురస్కృతముగ నీతి ప్రవచనము నిపుణముగ చేయబడినది. ప్రతి పద్యము సద్యోహృద్య మగు నొక సురుచిర సూక్తి. దాసుగారీ నూరింటిని నూరు జ్ఞానచక్షువులుగా సంభవించిరి. రెండవ కూర్పు: 1930.)
అచ్చ తెలుగు గ్రంధములు
1.    మన్కి మిన్కు (ఇది ఆయుర్వేదమునకు సంబంధించిన పరమాద్భుతమైన పరిశోధన గ్రంధము. అధర్వసంహిత, కృష్ణయజుర్వేద తైత్తిరీయారణ్యకము, రుగ్వేదీయ తైత్తిరీయారణ్యకము, ఐతరేయ బ్రాహ్మణము, చాందోగ్యద్యనేకము లుపనిషత్తులు దాసుగారి పరిశోధనకు విహారభూతములైనవి. వారి శాస్త్రజ్ఞతకు, దేశ్యాంధ్ర భాషాభిజ్ఞతకును శాణోపల మీకృతి. వారి ప్రామాణిక దృష్టియు, సమన్వయ ప్రజ్ఞయు కడు శ్లాఘ్యములు. శాస్త్రీయములగు సంస్కృత పారిభాషిక పద జాలమునకు వారి తెలుగుసేత అత్యంతాశ్చర్యకరము. ఇది గద్య ఘటితము. పరిశోధన: 1939-43. ముద్రణ: 1961)
2.    సీమ పల్కు వహి  (ఇదియొక అపూర్వ నిఘంటువు - అచ్చ తెలుగు నిఘంటువు. ఇతః పూర్వమే నిఘంటువుల కెక్కని పదజాల మెంతో యిందు ఎక్కడికక్కడ లెక్క దేలిన పర్యాయవాచకములన్నిటితో సహాయున్నది. మాతృభాషయందింత మమకారము, ఇంత ప్రభుత్వము, ఇన్ని మనసు కాన్పులును గల సారస్వతస్రష్ఠను మరి చూడబోము. ఈ గ్రంధమునకు గల విపుల పీఠిక మిగుల విలువైనది. విషయ గౌరవమునందేగాక పరిశోధన పాటవమునను దాసుగారికి తోడావై చుట్టినది. ఇందు తెలుగు భాషయొక్క స్వభావము, సంస్కృతముతో దానికి గల భేద సాదృశ్యములు, సంస్కృత శబ్దముల వాలే గన్పట్టు తెలుగు నుడువులు, తద్భవములుగా భ్రమింపబడిన తెలుగు పలుకులు, తెలుగులుగా భ్రమింపబడిన అన్యదేశ్యములు, నాటు తెలుగవునని కాదని వాదు కగ్గమైన మాటలు - ఇత్యాది విషయములెన్నియో బాహుదాహరణములతో చక్కగా నిరూపింపబడినవి. ప్రకృతము '' నుండి 'కందు' వరకు గల యొక భాగము మాత్రమే. ఆ. నా. దాస అముద్రిత గ్రంథ ప్రచురణ సంఘము, విజయనగరం వారిచే 1967లో ముద్రితమైనది. ఈ నిర్మాణమునకు కృషి 1939-43.)
3.    గౌరప్ప పెండ్లి (అచ్చతెలుగు హరికథ: అచ్చ తెలుగుపై దాసుగారి కమిత మమకారము. ఫలితముగా నిది యవతరించినది. 1931లో నారాయణ దాసుగారు, 1940లో శిష్యుడు చిట్టిమళ్ల రంగయ్యదాసు మాత్రమే కొలది పర్యాయము లేతత్కథాగానము చేసిరి. అచ్చతెనుగున పూర్వులు చూపని క్రొత్త మెళకువలు కొన్ని చూపినారు దాసుగారు.)
4.    అచ్చ తెలుగు పలుకు బడి (ఇది మంజరీ ద్విపదలో బడి పద్దెముగా వ్రాయబడిన లఘుకృతి. అచ్చ తెనుగు ప్రాశస్త్యమును దానిపై దాసుగారి మమకారమును అభివర్ణించునట్టిది. ప్రచురణ: సుజనరంజనీ ముద్రాశాల కాకినాడ. 1929.)   అలభ్యము
సంగీత ప్రబంధము
1.    దశ విధ రాగ నవతి కుసుమ మంజరి (మొదటి సగము సంస్కృతములోను రెండవ సగము తెలుగులోను రచించబడిన తొంభై రాగాల మాలిక. అపూర్వము, అనన్య సామాన్యము, అనితరసాధ్యము అయిన ఇంతటి అద్భుత సంగీత గ్రంధము ఇంతవరకు ప్రచురించబడియుండ లేదు)
నాటకము
1.    సారంగధర
స్వతంత్ర కావ్యములు
1.    బాటసారి (ఒక తరము క్రిందట విశేష ప్రచారమునందుండిన కావ్యరాజము. బహువారములు విశ్వవిద్యాలయ పట్ట పరీక్షలకు పఠనీయ గ్రంధము. అవిద్యావరణములో అవతరించిన మానవ జీవితము ప్రజ్ఞానసిద్ధివడసి సార్థకమగుట యిందలి వస్తుతత్వము. ఇదియొక గూఢ వస్తుమయ కావ్యము (allegorical poem). వేదాంతపరమైన ఒక మహార్థ వివేచన మిందు చతురస్రముగా సాగినది. ప్రసాదగుణ ప్రవణమైన మనోజ్ఞ రచన. దీని రచనాకాలమునాటికి దాసుగారికి  24 సంవత్సరములు. (సం. 1888). పిన్నవయసునందే హృదయ పరిపాకముగల పెద్దరచన చేసిరి. వారి జీవితకాలమునందే పలుతడవలు ముద్రితమైనది.)
2.    తారకం (సంస్కృతము. పాణిని వ్యాకరణ సూత్రాలకు లక్షణ-లక్ష్య అనుబంధముగా ఉపయోగపడే అపూర్వ కావ్యము)
హరికథలు (సంస్కృతము)
1.    హరికథామృతము (శ్రీకృష్ణ వృత్తాంతము: ఇది శ్రీకృష్ణ జననము, పితృబంధ విమోచనము, ధర్మ సంస్థాపనము అను మూడు హరికథల సంపుటి.)
హరికథలు (తెలుగు)
1.    యథార్థ రామాయణము (దాసుగారొక విశిష్ట ప్రణాళికపై రామాయణమును షట్కథా సంపుటిగా రూపొందించిరి. అనేక ప్రక్షిప్తములతో గూడిన నేటి వాల్మీకి రామాయణమున ఆ అతిలోక ధీరోదాత్త నాయకునకు, ఆర్షకవి హృదయమునకు తగినట్లు యథార్థ కథ ఎట్లుండవలెనో నిరూపించిరి. ఇది నాటినుండి నేటివరకు యావదాంధ్రమునను జనానీకమున భక్తి సద్భావ సంపదను, కళారాసిక్యమును పెంపొందించుచున్నది.
1915 లో రచించిన "శ్రీరామ జననము", "సీతాకల్యాణము", “పాదుకా పట్టాభిషేకము", "రామ సుగ్రీవ మైత్రి", "హనుమత్సందేశము", "సామ్రాజ్యసిద్ధి" అనే ఈ ఆరు హరికథల సంపుటిని అదే సంవత్సరంలో పరమపదించిన తన భార్యకు అంకితమిచ్చారు.)
2.    అంబరీష చరిత్రము (1884లో ఛత్రపురములో ఒక పెండ్లి పెద్దతో పంతము వచ్చి రాత్రికి రాత్రి రచించి ధారణచేసి మఱునాడుదయమే పెండ్లి పందిట్లో దాసుగారు గానము చేసిన హరికథ.)
3.    భీష్మ చరిత్రము (రచన 1902. భావనలో పోతన పోకడ; రచనలో తిక్కన చిక్కనయు గల కృతి.)
4.    ప్రహ్లాద చరిత్రము (ఒకపరి విశాఖపట్టణమున ప్రభల లక్షినరసింహం పంతులుగారి ఇంట దాసుగారు బసచేసియుండిరి. ఎవరో వచ్చి పంతులుగారికి "భక్త ప్రహ్లాద" నాటకపు కాంప్లిమెంటరీ టిక్కెట్టు ఇచ్చినారట. "ప్రహ్లాదుడే నాయింట బసచేసియుండగా నాకెందుకీ నాటకము?" అని పంతులుగారు దానిని తిరస్కరించిరట. ఆ దాసుగారు పలుతడవులు గానము చేసి పరవశించిపోయిన కథ ఇది. రచన 1898. సంగీతవైషయమున ఒక వైశిష్ట్యము గలదు.
ఒక సభలో ఈకథా గానం చేస్తున్నప్పుడు దాసుగారు ఆధునిక కవిత్వంపై ఆశువుగా ఒక పద్యం చెప్పారు. ఆపద్యం ఇప్పటికీ ఆధునిక కవిత్వానికి అన్వయించబడుతుంది అంటే అది దాసుగారి దార్శనికతకి నిదర్శనమే!)
5.    గజేంద్ర మోక్షణము (1886 లో రచించిన హరికథ. 1894లో మైసూరు మహారాజావారి సమక్షమున తతస్తతముగా సాంగ్లానువాదముగా చెప్పి రాజసన్మానము నందిరి.)  
6.    సావిత్రి చరిత్రము (సంతానార్థము దాసుగారు మాతృశ్రీ ఆదేశానుసారం 1902లో రచించిరి. 1903లో పుత్రికను బడసి ఆమె కా పేరిడిరి. అనేక జన్యరాగాముల విషయమునను, కీర్తనలందు ముద్రాలంకార విషయమునను ఒక విశిష్టత గలది.)
7.    మార్కండేయ చరిత్రము (విజయనగరమున నొకప్పు డనావృష్టి ఏర్పడినప్పుడు ముందుగా ప్రతిజ్ఞ చేసి "మూడు కోవెళ్ళులో దాసుగారీ కథ చెప్పి మూడు దుక్కులు వాన కురిపించినారట. వారి పవిత్ర వాక్కున హరకథయు  హరికథయై ప్రత్యక్షంగా శివంకరమై ఫలించినది. రచన 1891.)
8.    రుక్మిణి కళ్యాణము (ప్రకృతి పరమాత్మల సమైక్యం అంతరమైన పరమార్థముగా రూపొందిన కథ. 1898కి పూర్వపు రచన. మిక్కిలి వాసికెక్కిన కృతి.)
9.    హరిశ్చంద్రోపాఖ్యానము (1898కి ముందటి రచన.  లో విజయనగరమున రీవా రాణి అప్పలకొండయంబగారు దాసుగారి ఏతత్కథాగానము విన్నప్పుడు శోక వివశయై  అంత కరుణారస పరిప్లుతి గల ఆ కథ నింకెప్పుడు చెప్పవద్దని కోరిరి.)
10.         జానకీ శపథము (సవర్ణదీర్ఘ సంకలితముగ గూడ సార్ధకమైన రచన. ఇందు మేళకర్త రాగముల మేలిమి పరిమళించుచున్నది. ఒకరిద్దరు శిష్యులేపాటియో చెప్పగలిగినను సిద్ధపురుషుడు దాసుగారికి మాత్రమే అనాయాస సాధ్యమైనది. ఈ హరికథలో 36 అపూర్వ రాగాలలో కీర్తనలు రచించారు.)
11.         గోవర్ధనోద్ధారము (ఒకపరి చేబ్రోలులో దాసుగారు రుక్మిణీకల్యాణము చెప్పుటకు సిద్ధముగా నుండగా సభలో ఎవరో కొంటెగా "హరికథ కాదు గిరికథ చెప్పండి" అనగా అప్పటికప్పుడు ఆశువుగ ప్రయోగమును మించిన ఆశుకవితా పాటవముతో గద్య, పద్య, గేయము లల్లి అలవోకగా చెప్పిన హరికథ. ఇది నేడు లబ్ధము కాదు గాని అంబరీష చరిత్రమున ఒక అవాంతర కథగా నిది ప్రసక్తమైనది.)
12.          ధ్రువ చరిత్ర (హరికథక  ప్రపంచమున ధ్రువతారలైన వీరి హరికథా వాఙ్మయచరిత్ర "ధ్రువ చరిత్ర" రచనతో ప్రారంభమైయుండుట విశేషము. అదీ వారి 19వ యేట 1883లో, అవలీలగా ఒక్కరోజులో ధారణచేసి అతిహేలగా విజయనగరమున వేంచేసియున్న గానలోలుడు వేణుగోపాలస్వామి సన్నిధానమున గానము చేసిరి. ఆ కథనే పలుతావుల గానము చేసి ఘనసన్మానము లందిరి. కాని ఈగ్రంథ మలబ్ధము.)
 ***
దాసభారతి ప్రచురణలు
 శ్రీమదజ్జాడ అభిభట్ల నారాయణ దాసుగారి సాహిత్యముపై సమీక్ష గ్రంధమాలిక
(“శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస కథా గాన కళా పరిషత్ మరియు దాస భారతి ప్రచురణలు వ్యవస్థాపకులు మరియు ప్రచురణ కర్తలు శ్రీ నారాయణ దాసుగారి దౌహిత్రి భర్త శ్రీ కర్రా ఈశ్వర రావు గారు)

1.    శ్రీ ఆదిభట్ల నారాయణ దాస శతజయంతుత్సవ సంచిక. 1967. (శ్రీ నారాయణ దాసుగారి సంగీత, సాహిత్య ప్రతిభాపాటవాలపై వారి సమకాలికులు, ఇతర పండితుల సమీక్ష వ్యాసాలు. సంస్కృతి సమితి చీరాల.)
2.    శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనం. 1974. (శ్రీ నారాయణ దాస సాహిత్యంపై డా. ఎస్. వి. జోగా రావు గారి సంపాదకత్వంలో వెలువడిన సమగ్ర సమీక్షా వ్యాసమాలిక)
3.    శ్రీ నారాయణ దాస జయంతోత్సవ ప్రసంగ వ్యాస సంపుటి
4.    కచ్ఛపి శ్రుతులు (శ్రీ నారాయణ దాస సాహిత్యంపై ప్రముఖ సాహిత్య విమర్శకులు రచించిన వ్యాస సంపుటి)
5.    ఉపాయనలు (శ్రీ నారాయణ దాస సాహిత్యంపై ప్రముఖ సాహిత్య విమర్శకులు రచించిన వ్యాస సంపుటి)
6.    పూర్ణపురుషుడు (శ్రీ యామిజాల పద్మనాభ స్వామి రచించిన శ్రీ నారాయణ దాసుగారి జీవిత చరిత్ర)
7.    స్వయంలేఖనము (శ్రీ నారాయణ దాసుగారి జీవిత విశేషాలపై "స్వయంలేఖనము" ప్రక్రియలో రచించబడిన విమర్శ వ్యాసము దాని అనుబంధ వ్యాసావళి)
8.     ఉమర్ ఖైయామ్ అమర గేయాలు (శ్రీ నారాయణ దాసుగారి సంస్కృత రచనకు శ్రీ యామిజాల పద్మనాభ స్వామి తెలుగు అనువాదాలు)

2 comments:

  1. i need Talli vinki and Vennuni Veyiperla Vinakari books where i will get

    ReplyDelete
    Replies
    1. Thank you for your query. For copies of TALLI VINKI, please consult Sri Sarada Parameswari Devasthanam, Sampath Nagar, Gunturu. A new edition of VENNUNI VEYI PERLA VINAKARI is under preparation and will be available later this year.

      Delete