Thursday, September 19, 2013

Sangeetha Jagruthi Institutes ‘The Pandit Adibhatla Narayana Das Memorial Award’



Sangeetha Jagruthi, a music and cultural organisation of Bengaluru celebrated Pandit Narayana Das' sesquicentennial on September 5 on a grand scale, in a sabha held in the Bangalore Gayana Samaja auditorium. The organisation instituted a national award in the name of Sri Adibhatla Narayana Dasu. The first award was given away to Dr. Srikantham Nagendra Sastry a well known Karnatic Music exponent by ‘Kalatapasvi’ Sri K. Viswanath the famous film maker who made a number of films with classical music and dance as the backdrop of their storyline. Sri A. V. Rajtrinath, the founder of Sangeetha Jagruthi infomed that the ‘The Pandit Adibhatla Narayana Das Memorial Award’ which carries a citation and a cash award of Rs 1,00,000/- would be given away to an eminent exponent in the fields of Karnatic Music or Harikatha every year. 




Here is a selection of photos from the function:



Monday, September 16, 2013

The Sesquicentennial Begins


Pandit Narayana Das' 149th birth anniversary (August 31, 2013) marks the beginning of his sesquicentennial year. AP Government's Department of Culture and Tirumala Tirupathi Devasthanams are orgainising year-long celebrations. 

The TTD's celebrations of the 150th birth anniversary began with a week-long seminar in Tirupathi on September 1, held in the Mahati Auditorium. Each day of the seminar was marked by a paper presentation on one aspect of Pandit Narayana Das' oeuvre and performance of a Hari Katha written by him. 

On September 4 (Pandit Narayana Das' birth day as per Telugu calendar), famous film director Sri K. Viswanath unveiled a statue of the great man in the premises of Sri Venkateswar Music and Dance College. 

The poster outside Mahati Auditorium, Tirupathi 
The poster outside Mahati Auditorium, Tirupathi
The venue of the seminar
The venue of the seminar
The venue of the seminar
Pandit Narayana Das' statue ready for inauguration
K Viswanath walking in to unveil the statue
Pandit Narayana Das' statue
K Viswanath speaking after unveiling the statue.
M G Gopal, Executive Offiver, TTD also seen in this picture. 
K Viswanath speaking after unveiling the statue
M G Gopal, Executive Officer, TTD addressing the media.
Also seen in the picture: K Viswanath (L).
K Viswanath speaking after unveiling the statue
K Viswanath addressing media after unveiling the statue
M V Simhachala Sastry addressing invitees after statue inaguration
K Viswanath addressing invitees after statue inaguration
Prayer before the seminar began on Septemeber 5
U Raja Rajeswari Devi presenting her paper:
"Purnapurushudu, Srimadajjada Adibhatla Narayana Dasu"
Seen on the stage: Sri Ravva Srihari, Editor, TTD Publications &
Smt. Challa Prabhavathi Deekshitulu, Principal S V Music & Dance College

Saturday, September 7, 2013

హరికథ ఎలా ఉండాలి?

హరికథ స్వరూప, స్వభావలెలా ఉండాలో వివరిస్తూ నారాయణ దాసుగారు ఆంధ్ర పత్రిక 1911 ఉగాది ప్రత్యెక సంచికలో హరికథ అనే వ్యాసం వ్రాసారు. అందులోనిది ఈ పద్యం:   
ఘన శంఖమో యన గంఠంబు పూరించి
మేలుగ శ్రుతిలోన మేళవించి
నియమము తప్పక నయ ఘనంబుల బెక్కు
రాగ భేదంబుల రక్తి గొల్పి
బంతు లెగిర్చిన పగిది కాలజ్ఞతన్
జాతి మూర్చన లొప్ప స్వరము పాడి
చక్కని నృత్యము సర్వరసాను కూ
లంబుగాగ నభినయంబు చేసి
స్వకృత మృదు యక్షగాన ప్రబంధసరణి
వివిధ దేశంబులం బిన్నపెద్దలు గల
పలు సభల హరిభక్తి నుపన్యసింప
లేని సంగీత కవితాభి మాన మేల

అసాధ్య / సంగీత అష్టావధానం

నారాయణ దాసుగారు తన పంథొమ్మిదవ ఏట హరికధా ప్రదర్సనలతో సమాంతరంగా అవధాన ప్రక్రియ ప్రదర్సన కూడా మొదలు పెట్టారు. అయితే అయన అష్టావధానాలు తక్కిన వారి అష్టావధానాలకు భిన్నంగాఅయన సంగీత సాహిత్య ప్రతిభకుబహుభాషా పాండిత్యానికి దర్పణాలుగా ఉండేవి.  ఉదాహరణకుఅయన అష్టావధానాలలో వ్యస్తాక్షరి గ్రీకు భాషలో ఉండేది. 

నారాయణ దాసుగారు బందరులో పంతులుగారి మేడమీద ప్రదర్శించిన అష్టావధానం ప్రవేశ రుసుముతో జరిగింది.  అష్టావధానం 1888-89 లో వారు కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బందరులలో సాగించిన సాహిత్య యాత్రలో భాగంగా ప్రదర్శించారు. సంగీతానికి సంబంధించిన అంశాలు అందులో ఉండడం దాని ప్రత్యేకత.  రెండు పాదములతో రెండు తాళములురెండు చేతులతో రెండు తాళములు వేసి పల్లవి పాడుచూ కోరిన జాగాకు ముక్తాయిలు వేయుటనలుగురకు తెలుగుననలుగురకు సంస్కృతమున కోరిన పద్యములు కవిత్వము చెప్పుటవ్యస్తాక్షరిన్యస్తాక్షరిగణిత శాస్త్ర సమస్యను సాధించుటపూలుగంటలు లెక్కించుటఛందస్సంభాషణఇంగ్లీషులో ఉపన్యాసము మొదలైనవిఆ అష్టావధానంలో అంశాలు. 

శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు యక్షగాన రూపంలో రచించిన “నారాయణ దాస జీవిత చరిత్ర” లో నారాయణ దాసుగారి సంగీత / అసాధ్య అష్టావధానాన్ని ఈ విధంగా వర్ణించారు:

ఇరు హస్తములతోడ జెరియోక తాళంబు
చరణద్వయాన నేమరక రెండు
పచరించి, పల్లవిబాడుచు గోరిన
జాగాకు ముక్తాయి సరిగా నిడుట
నయమొప్ప న్యస్తాక్షరియును వ్యస్తాక్షరి
ఆంగ్లంబులో నుపన్యాస, మవల
నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ
తంబున వలయు వృత్తాల గైత,
సంశయాంశంమ్ము శేముషీ శక్తితో బ
రిష్కరించుట, గంటలు లెక్కగొంట
మరియు ఛందస్సుతోడి సంభాషణంబు
వెలయు నష్టావధానంబు సలిపె నతడు

[నారాయణ దాసు గారు అష్టావధానం చేసిన మరునాడు, బుధవిదేయిని అనే స్థానిక పత్రిక ఆ అవధానం గురించి వ్యంగ్యంగా బ్రహ్మశ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు చిన్నపనులగుంపు చేసేరు అని వ్రాసింది. నారాయణ దాసుగారు దానికి  తీవ్రంగా  స్పందిస్తూ, ‘కలుషహారిణి అనే ఇంకొక స్థానిక పత్రికలో ఇలా ప్రకటన ఇచ్చారు: నారాయణ దాసుగారు చేసినది అసాధ్య అష్టావధానముసంగీత సాహిత్యములలో ఇట్లవధానములు చేయు సమర్ధత ఇంకోక్కనికుండుట దుర్ఘటమని ఏల వ్రాయకూడదునా అష్టావధానము గ్రహించి వ్రాయుటకు కేవల సాహిత్యజ్ఞుడగు బుధవిదేయిని ప్రకటనకర్త సమర్ధుడు కాదు; పైగా నా ప్రతికక్షులలో చేరియుండుటచే అట్లు వ్రాసెను.” ఆ ప్రకటనతో బుధవిదేయిని’, కలుషహారిణి పత్రికల మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. నారాయణ దాసుగారి సమర్ధకులుప్రత్యర్ధులు ఇరువైపులనుండి వ్యాసపరంపరలతో పోట్లాడుకున్నారు. చిలికి చిలికి గాలివాన అయినట్లే ఒక పెద్ద సాహిత్య దుమారమే చెలరేగింది.

ఈలోగాఅంతకుముందు పల్లవి ప్రదర్శనలో పరాజితులైన దాసుగారి ప్రతికక్షులు సంగీతంలో ఆయనను ఓడించాలనే ఉద్దేశంతో ఒక సభ చేసి,చేతనయితే అందులో వారితో పోటీకి రావాల్సిందిగా వర్తమానం పంపేరు. నారాయణ దాసుగారు ఆ సవాలును స్వీకరించి ఆ సభకు హజరయ్యారు.  అయన హుందాగా సభలో ప్రవేసించినంతనే బ్రావో’ అనే హర్షధ్వానాలు మిన్నుముట్టేయి. ఆ సభకు అధ్యక్షత వహించిన నారాయణ దాసుగారి ప్రత్యర్ధి (ఒక వకీలు), “నారాయణ దాసుగారు ఇక్కడ ఉన్న ఇరవై మంది సంగీత విద్వాంసులు విద్యయందు తమకు చాలరని ప్రకటించినందుకే ఈ పోటీ సభ నిర్వహించబడింది. కనుక వీరు వేయు ప్రశ్నలకతను సమాధానము చెప్పవలెను. ఈ శాస్త్ర పరీక్షలో అతను నెగ్గినచొ అతడందరికన్నా గొప్ప సంగీత విద్వాంసుడని అంగీకరించబడును. లేనిచో అతడు అందరికి క్షమాపణ చెప్పవలెను అన్నారు .అప్పుడు నారాయణ దాసుగారు లేచి సభికులారాఈ విద్వాంసులందరూ సంగీతమున నాకు లోకువయని వీరలు నన్ను తిరస్కరించినపుడెల్ల నేనన్నమాట నిజమే. సంగీత విద్వాంసులమనుకొన్నవారిలోనే సంగీత తత్వము తెలిసినవారుంట అరుదన తక్కినవారి గురించి చెప్పనేలకావున మాకు మధ్యస్థులై మీరు ఉండుట అసాధ్యము. ఇప్పుడు వీరు సంగీత శాస్త్రమున నన్ను పరీక్షించుటకు అనర్హులు. కారణమేమన సంస్కృతభాష కొంచెమైనను వీరికి తెలిసినట్లు కాన్పించదు. సంస్కృత భాషాజ్ఞాన మిసుమంతయులేని వారికి సంస్కృతమున వ్రాయబడిన సంగీత శాస్త్రమన్వయింప బడదు కదాకావున సంగీత శాస్త్రములోని సూత్రములు కాని పద్యములు కాని నేను చదివితే వీరికి అర్ధమే కాదు. కనుక శాస్త్ర చర్చ నాతొ చేయుటకు వీరు తగరని స్పష్టము.  ఇక శ్రోతృరంజక స్వరసందర్భము సంగీతము. కనుక వీరందరును కలిసి ఒక గంట పాడనిండు. పిదప నేను ఒక గంట పాడెదను. ఎవరి పాట మిక్కిలి రంజకముగా ఉండునని మీకు తోచునో వారధికులుగ నిర్ణయింపబడుడురు. ఇది నా మనవి అన్నారు. అప్పుడు సభాధ్యక్షులు లేచి, ఉభయుల వాదనలు విన్నాము. శాస్త్ర వాదమగునప్పుడు తగువు తీర్చుటకు మేమనర్హులము. ఉభయ కక్షల వారు పాడి సభారంజకమొనర్చుట మా కోరిక అన్నారు. అందుకా ప్రతికక్షులు మీ అందరికి రక్తి చేయుటకు ఈ సభ నిర్వహించబడలేదు అని ఇంకా వారి అక్కసు అంతా వెళ్ళగక్కేరు. దానికి నారాయణ దాసు గారి శిష్యుడొకడు దీటైన సమాధానం ఇచ్చేడు. రణగొణధ్వనుల మధ్య సభ ముగిసింది.  

బందురులో నారాయణ దాసుగారి ప్రతికక్షులలో ముఖ్యుడు హరి నాగభూషణం గారనే సంగీత విద్వాంసుడు. నారాయణ దాసుగారి పత్రికా ప్రకటనకు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసి వ్యాస పరంపరల యుద్ధం మొదలు పెట్టింది ఆయనే. ఇంత జరుగుతున్నా నారాయణ దాసుగారు అందులో జోక్యం చేసుకోలేదు. అలా కొన్ని నెలలు సాగిన యుద్ధం చివరకు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి జోక్యంతో ముగిసింది. నాగభూషణం గారు ఉపసంహారం అనే పేర బుధవిదేయిని పత్రికలో వ్రాసిన వ్యాసంతో డొంకతిరుగుడుగా క్షమాపణ చెప్పారు.  బుధవిదేయిని పత్రిక సంపాదకులు పురుషోత్తమ రావు గారు తమ కుమారుని నారాయణ దాసు గారింటికి పంపారు. ఆ అబ్బాయి నారాయణ దాసుగారిని కలిసి'మా నాన్నగారు నమస్కారాలు తెలపమన్నారుఅని తెలిపాడు. ఆ కధ అంతటితో సుఖాంతం అయింది. అయితే దానికి కొసమెరుపు లేక పోలేదు. అప్పటికి కొన్ని దశాబ్దాల తరువాత అంటే 1932 లొ బందరు పట్టణంలో హరి నాగభూషణం గారే అధ్యక్షత వహించిన సంగీత విద్వాంస సభలో నారాయణ దాసుగారి స్వరాక్షర కృతులను ఆచార్య పి. సాంబమూర్తి ప్రభ్రుతులు ఎంతో కొనియాడారు. ఆచార్య సాంబమూర్తిగారు 15-9-1932 న వ్రాసిన లేఖను బట్టి దాసుగారు 1927 లో మదరాసులో జరిగిన అఖిల భారత సంగీత పరిషత్తు ప్రారంభోత్సవ సభలో కొన్ని లోకోత్తరములైన స్వరాక్షర కృతులను గానం చేసినట్లు తెలుస్తున్నది.]  

Saturday, May 25, 2013

బెంగుళూరు నగర వర్ణన


నారాయణ దాసు గారు వారి సంగీత సాహిత్య జైత్రయాత్రలో దర్శించిన అనేక ప్రదేశాలను, కలసిన వ్యక్తులను పొందిన అనుభూతులను వర్ణిస్తూ రచించిన పద్యాలను మేలు బంతి అనే గ్రంధంలో ప్రచురించారు. ఈక్రింద ఇచ్చిన బెంగుళూరు నగర వర్ణన, మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడయార్ - 10 (1863 - 1894), బెంగుళూరు దర్బారులో ఆశువుగా రచించినది. ఆ పద్యం ఎంతో బాగుందని వ్రాతప్రతిని అడిగి తీసుకుని భద్రపరుచుకున్నరుట మహారాజా వారు.

అలరుతేనియ లూరు దలిరులజిగి మీరు
          విన్నగరువుదీరు బెంగుళూరు
చిరుత మబ్బులకారు చెమటరాని షికారు
          వేడుకలింపారు బెంగుళూరు
చెరకు తీయనినీరు చేలపచ్చనిబారు
          వేల్పునగరుగేరు బెంగుళూరు
ఆవుల పాలేరు తావుల వేమారు
          పిలువదగిన పేరు బెంగుళూరు

వింత నగనాణెముల నారు బెంగుళూరు
పెనుతెవుళులకు మందు వేర్బెంగుళూరు
తెల్లదొరలను రాగోరు బెంగుళూరు
వేనుడువులేల బంగారు బెంగుళూరు                  
               

Thursday, May 2, 2013

రుక్మిణి సౌందర్య వర్ణన – సీస పద్యం సొగసు


నారాయణ దాసు గారికి సీస పద్య వృత్తం అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే భాషా సౌందర్యానికి, భావ వ్యక్తీకరణకి ‘సీసం’ చక్కని వాహిక. దిగంతమే ప్రతిభకి హద్దు అయిన సంగీత సాహిత్య సార్వభౌముడే అల్లిన సీస పద్య సౌలభ్యం గురించి ఇక చెప్పేదేముంది? రుక్మిణి కళ్యాణం హరికథలోని ఈ సీస పద్య సౌందర్యాన్ని ఆస్వాదించండి!

దుర్వాంకురంములతో సన్నజాజులు
          మొగలిరేకులు జారుసిగను జుట్టి 
తళుకుజెక్కుగులాబిదంతము నిగనిగ
          రవలకమ్మలజోడు జెవులబెట్టి   
లేతప్రాయపు బిగిచేతిగాజులు, రైక
          యొడ్డాణమున్వెలియుడుపుగట్టి
ముద్దుమొగంబున ముత్తయిదుచిన్నెల
          నంబపేరిట నోగిరంబు వట్టి

వెన్నెలలు చీకటులు బర్వు కన్నుదోయి
ముత్తెముల్కెంపులొల్కెడి ముద్దువాయి
నందమగు రుక్మిణికన్య యలరు హాయి
చాటిజెప్పగ వేయినోళ్ళు చాలవోయి

Tuesday, April 30, 2013

గణిత శాస్త్ర ఉపమానాలతో భగవంతుని పరిచయం


శాస్త్ర విజ్ఞానం తుదిమెట్టు వేదాంతమే. అందుకే ఏ శాస్త్రంలోనైనా (కళలోలైనా) అత్యున్నత అర్హతగా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్. డి.) పట్టా ఇస్తారు.  ఈ పద్యంలో దాసు గారు గణిత సంకేతాలను ఉపమానంగావాడి భగవంతుని (వేదాంత) తత్వాన్ని సులభంగా బోధపరిచారు. ఇది వారి సృజనాత్మతకి అత్యున్నత ఉపమానం.

వలయరేఖకుబోలి వశమె తెల్పంగ నీ
          కాది మధ్యాంతము లప్రమేయ
ఎల్లజగంబుల కీవె యాధారము  
          లెక్కల కన్నింటి కొక్కటి వలె
ధర్మము వైపె ఎంతయు జోగుచుందువు
          బలువువంకన్ త్రాసు ములు విధమున
పెరుగవు తరుగవు విభజింపబడవు శూ
          న్యాంకమువలె నకలంక చరిత!

పిన్నకున్ బిన్న పెద్దకున్ బెద్దవీవు
కొలత కందవు నిన్నెన్న నలవికాదు
చెలగు సరిబేసియై నీవు తలచినంత
భక్తమందార! భవదూర పరమపురుష

(యధార్థ రామాయణము. పు. ౧౩౭)

నారాయణ దాసు గారి కవితా విమర్శ


నారాయణ దాసు గారు వారి కాలంలో కనపడిన కృతకమైన కవితా ధోరణులను ఇలా దుయ్యబట్టేరు:

పూర్వప్రబంధము పోల్కికై చచ్చిన
          యీగనంటిన్చెడు హీనుడొకడు
ప్రౌకల్పనలని పన్ని తనకుదానె
          యర్ధంబెరుగలేని వ్యర్దుడొకడు
కృతిని నిఘంటువు వెతకి ముదురు తాటి
          ముంజెవలెన్ జేయు మూర్ఖుడొకడు
తేట తెల్లంబని తెన్గుబాసకు బట్ట
          తెరచి చూపించెడి దేబె యొకడు

కలివశంబున శారద కలుషయయ్యె
బిదపకాలంబున దలంపు పిచ్చియయ్యె
అచ్చుచవకయ్యె మూఢులు మెచ్చుటయ్యె
ఆహహా! ఎందుకు కవులైరి యాధునికులు?

అయితే అయన దృష్టిలో కవితాదార ఎలా ఉండాలి?

సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగకరణి
సాలెపురుగు కడుపులోని నూలువలెను
దబ్బునన్ బొర్లిపడు గొండధారమాడ్కి
సహజకవిత బయల్వెడి సన్నుతిగను  

Monday, April 29, 2013

నారాయణ దాసు గారి హరికథ​లలో హాస్య-చమత్కారం


హాస్యం అనేది కథాకథనంలోంచి పుడితే ఎంతో అందంగా ఉంటుంది. బైటనించి చొప్పిస్తే కృతకంగా, అతుకులబొంతలా ఉంటుంది. ఒకసారి నారాయణ దాసు గారు మహారాణి అప్పలకొండయాంబ​ (రీవారాణి) గారి సమక్షంలో రుక్మిణి కళ్యాణం హరికథ చెప్తూ “రాధా రుక్మిణుల సంవాదము” అనే ఈ కింద ఉదహరించిన కీర్తనను ఆశువుగా చెప్పేరు.  ఈ కీర్తనలో హాస్యం, చమత్కారంతో బాటు అద్భుతమైన సృజనాత్మకత కనిపిస్తుంది:

రాధ:              మిరమిర చూడ్కుల నాసామికిన్ దిష్టిపెట్టకే
                    హరిదరి నేనున్న యప్పు డతివ నీ పప్పుడకదే             ||మిర||

రుక్మిణి:          పరమపురుషుజూడకున్నవారి కన్ను లెన్దుకే
                    అరయగ దేవునిపెండ్లికినక్క యందరు పెద్దలే                ||పర||

రాధ:             చక్కని చిన్నదానవని చాల విర్రవీగకే
                   నక్కయని నన్వెక్కిరించి తక్కులాడి నిక్కకే                  ||మిర||

రుక్మిణి:          మిక్కిలి హరిభక్తిలేని మేనిసోగసులెందుకే
                   అక్కవైతివమ్మవైన నందుకే నేమందునే                      ||పర||

రాధ:             కడు గయ్యాళిగంప గడుసుమాటలాడకే
                   సరిపడి నీకును నాకును సంబంధమెట్టులే                   ||మిర||

రుక్మిణి:          వడిగ మేనల్లు నత్త వలచి ముద్దరాలగున్
                   కడలియుప్పు నడవియుసిరికాయ చంద మాయేనే         ||పర||

రాధ:             మేరమీరి పిన్నపెద్ద తారతమ్య మెరుగవే
                   కారు రాచదాన! చెంపకాయలిపుడు తిన్దువే                  ||మిర||

రుక్మిణి:          మీరు .. వారుగాన మేరమీరు టుచితమే
                   నారాయణదాసుల కెన్నడును భయముకల్గదే               ||పర||


“ఈ సవతులకయ్యమందంతయు నున్నది ఉక్తి చమత్కారమే కదా. ఈ చమత్కారసంభాషణ ఘట్టములో వ్యాకరణమర్యాద ననుసరించి ‘అక్క - నక్క’, ‘అత్త - నత్త’ అను రూపములను గూర్చుట మిక్కిలి సందర్భోచితము.” (గుండవరపు లక్ష్మినారాయణ. ౧౯౮౩. నారాయణ దర్శనము. పు. ౫౧౨-౫౧౩)

Friday, April 26, 2013

శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు


“...నాలుగు పురాతన భాషలలో ప్రావీణ్యం గల పండితుడు; పర్షియన్ సాహిత్యాన్ని సంస్కృతం, అచ్చతెలుగులలోనికి తర్జుమా చేసిన అనువాద కర్త; కాళిదాసు, షేక్స్పియరుల కవిత్వపు సొగసులను తులనాత్మకంగా పరిశోధించి ప్రచురించిన గ్రంధకర్త; ఋగ్వేదమంత్రములను అచ్చతెలుగులోనికి అనువదించి వాటికి    సంగీత బాణీలను సమకూర్చిన సంగీతకర్త; తొంభై కర్నాటక రాగాలతో ఒక గీతమాలికను రచించిన వాగ్గేయకారుడు...” ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో, ఎన్నెన్నో! ఇన్ని పాండిత్య ప్రాభవాలను సంతరించుకున్న సంగీత, సాహిత్య దురంధరుడు భారత దేశ చరిత్రలో ఇంకొకరు లేరేమో?

ఆదిభట్ల నారాయణ దాసు గారు రచయిత, కవి, వాగ్గేయకారుడు, సంగీత విద్వాంసుడు, నర్తకుడు, నటుడు, బహుభాషా కోవిదుడు, భాషా శాస్త్రవేత్త, వేదాంతి – అన్నిటికీ మించి పరమ భాగవతోత్తముడు. అన్ని కళలలో ప్రావీణ్యం కల ఆయనను ‘ది హిందూ’ పత్రిక (౩౦ జూన్ ౧౮౯౪) “బహుముఖ ప్రజ్ఞాశాలి” అని శ్లాఘించింది.      

ఆదిభట్ల నారాయణ దాసు గారు తెలుగులో, అచ్చతెలుగులో, సంస్కృతంలో సుమారు ఏభై గ్రంధాలను రచించారు. వాటిలో స్వతంత్ర కావ్యాలు, ప్రబంధాలు, అనువాద గ్రంధాలు, వచన గ్రంధాలు, కవితా సంపుటాలు, శతకాలు, వేదాంత పరిశోధనలు, సంగీత ప్రబంధాలు, హరికథలు, పిల్లల నీతికథలు వగైరా ఉన్నాయి.

సాహిత్య పరిచయం

నారాయణ దాసు గారు రచించిన గ్రంధాలలో ముఖ్యమైనవి: జగజ్జ్యోతి (వేదాంత గ్రంధం). నవరస తరంగిణి (కాళిదాసు, షేక్స్పియర్ నాటకాలలోని నవరసాల పోషణల తులనాత్మక ప్రదర్శనకు, అయన ఎంచుకున్న ఆయా రసాల ఘట్టాలను అచ్చతెలుగులోనికి అనువదించారు). రుబాయత్ అఫ్ ఒమర్ ఖైయం (ఒమర్ ఖైయం పర్శియను గీతాల ఇంగ్లీషు అనువాదాలు మూలానికి న్యాయం చెయ్యలేదని నారాయణ దాసుగారి విశ్వాసం. తన వాదనను ఋజూవు చెయ్యడానికి, పర్శియను మూలాన్ని, ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్ద్ ఇంగ్లీషు అనువాదాన్ని సంస్కృతం, అచ్చతెలుగు భాషలలోనికి అనువదించి తులనాత్మకంగా  ప్రదర్శించారు. ౧౯౩౨లొ ముద్రించబడిన ఈ గ్రంధాన్ని, కేంద్ర సాహిత్య అకాడెమి గత సంవత్సరం పునర్ముద్రించింది.). తారకం (సంస్కృతంలో స్వతంత్ర కావ్యం. స్వాతంత్ర్యోద్యమానికి పరోక్షంగా వారు సూచించిన మధ్యే మార్గం కథావస్తువు. వేదాంత నేపధ్యం, పాణిని వ్యాకరణ సూత్రాలకు అనుబంధ ఉపయోగం ఈ కావ్య ప్రత్యేకతలు.). తల్లి విన్కి (లలితా సహస్రనామాలలోని ప్రతి నామానికీ అచ్చతెలుగు పద్యానువాదం). వెన్నుని వేయిపేర్ల వినకరి (విష్ణు సహస్రనామాలలోని  ప్రతి నామానికీ అచ్చతెలుగు పద్యానువాదం). ఋక్సంగ్రహం (ఈ గ్రంధానికి మ్రొక్కుబడి అనే నామాంతరం ఉంది. నారాయణదాసు గారు ౩౦౪ ఋక్కులను ఎంచుకొని వాటిని ఆంధ్రీకరించి, సంగీతం సమకూర్చారు. అయన ఈ ఋక్కుల అనువాద పద్యాలను వీణపై వాయించేవారు.) రామచంద్ర శతకం, కాశి శతకం (సంస్కృత శతకాలు). దశ విధ రాగ నవతి కుసుమ మంజరి (అద్భుతమైన, అనన్య సామాన్యమైన సంగీత ప్రబంధము. మొదటి సగం సంస్కృతంలోనూ, రెండవ సగం తెలుగులోనూ ఉన్న ఈ తొంభై రాగాల గీతమాలిక దేవీస్తుతి. నారాయణ దాసు గారు, వారి కన్యాకుమారి యాత్ర సందర్భంగా రచించారు.)    

హరికథ సృష్టి

మానవాళికి భక్తీ, జ్ఞాన, మోక్షములను ప్రబోధించే ఉద్దేశంతో నారాయణ దాసు గారు ‘హరికథ’ సృష్టి చేశారు. వారు హరికథను ‘సర్వ కళల సమాహారం’ అని అభివర్ణించారు. నారాయణ దాసు గారు సృష్టించిన హరికథలో కథాప్రవచనము, ఆశుకవిత్వము, శాస్త్రీయసంగీతము, నృత్యం, అభినయం ప్రధానాంగాలు. సమయ, సందర్భాలను బట్టి వారు ప్రదర్శించిన హరి కథలలో సంగీత, సాహిత్య చర్చలు ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే, నారాయణ దాసు గారు, అంతకుముందు జానపద కళగా ఉన్న హరికథను సారస్వత సభల స్థాయికి, సంగీత కచేరిల ఉన్నత స్థాయికి చేర్చారు.  ఈ కళా రూపాన్ని సృష్టించిన నారాయణ దాసు గారు ౧౭ తెలుగులోనూ, ౩ సంస్కృతంలోను, ౧ అచ్చతెలుగులోను, మొత్తం ౨౧ హరికథలను రచించారు. ఇందులో యధార్థ రామాయణం పేర శ్రీరామ కథ, ౬ (తెలుగు) హరికధలు, హరికధామృతం పేర శ్రీకృష్ణుని కథ ౩ (సంస్కృతం) హరికధలు మరియు గౌరాప్పపెండ్లి (అచ్చతెలుగు) హరికథ ఉన్నాయి. వారు రచించిన (ఉత్తర రామాయణ కథ) జానకీశపధం అనే హరికథ ౩౬ అపూర్వ కర్నాటక సంగీత రాగాలతోగూడి, సంగీతపరంగా ఎంతో ప్రశస్తిపొందింది.     

సంగీత వైదుష్యం

చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు నారాయణ దాసు గారిని ‘పుంభావ సరస్వతి’ గా అభివర్ణించారు. ఆయనకు శారదా దేవి అనుగ్రహం వలన సకల విద్యలూ సహజసిద్ధంగానే లభించాయి. కళలకు కాణాచి అయిన విజయనగరంలో మెట్రిక్యులేషన్ చదువుకునే రోజులలో వారు మోహబ్బత్ ఖాన్ అనే హిందుస్తానీ సంగీత విద్వాంసుని గానం వినడం తటస్థించింది. ఆ బాణీ వారికి నచ్చడం వలన దానితో కలిపి కర్ణాటక – హిందుస్తానీ బాణీ ల మేలుకలయికతో ఒక కొత్త బాణీని సృష్టించారు. ఆ బాణీ విజయనగరం సంగీత బాణీగా ప్రసిద్ది పొందింది. మేఘ గంభీరమైన వారిస్వరంలో, తాము సృష్టించిన కర్ణాటక – హిందుస్తానీ బాణీలో వారు ఆలపించిన సుమధుర సంగీతం పండితపామరులను ఎంతో అలరించేది. అ సంగీతానిని ఆస్వాదించి ఎంతో ప్రశంసించిన ప్రముఖులెంతోమంది. వారిలో మైసూరు మహారాజావారు, రబింద్రనాథ్ టాగోర్, విజయనగరం మహారాజావారు ముఖ్యులు. వీరిలో మైసూరు మహారాజావారు, విజయనగరం మహారాజావారు, దాసుగారిని తమ ఆస్థాన విద్వాంసుడుగా నియమించాలని కోరుకున్నారు. స్వతంత్ర జీవనాభిలాషులైన నారాయణ దాసు గారు అంగీకరించలేదు. విజయనగరం మహారాజావారు మాత్రం పట్టువిడవక, దాసుగారి సంగీత వైదుష్యం తమ రాజ్య ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ‘శ్రీ విజయరామ గాన పాఠశాల’ నామంతో దక్షిణభారత దేశపు మొట్టమొదటి సంగీత కళాశాలను స్థాపించి దానికి వారిని ప్రిన్సిపాలుగా నియమించారు. దాసుగారు కూడా తమ ఆదర్శాన్ని విడువక ఆ కళాశాలను శ్రీ రాముని మందిరంగా భావించి శ్రీ రాముని సేవ చేసుకుంటానని అంగీకరించారు. ౧౯౧౯లొ స్థాపించబడిన ఆ కళాశాల ఎంతోమంది గొప్ప సంగీత విద్వాంసులను తీర్చిదిద్దింది.

దాసుగారి సంగీత ప్రతిభకు నిదర్శనంగా రెండు విషయాలు ప్రస్తావించవలసి ఉంది. మొదటిది: నారాయణ దాసు గారి గానం ఎన్ని సార్లు విన్నా తనివితీరని మైసూరు మహారాజావారు వారి గానాన్ని ఫోనోగ్రాఫులో రికార్డు చేసుకున్నారు. అంతేకాక వారి ఆస్థాన విద్వాంసులను నారాయణ దాసుగారి వద్ద హిందుస్తానీ సంగీతం నేర్చుకోమని నిర్దేశిన్చారుట. రెండవది: నారాయణ దాసు గారి గానామృతం విని తన్మయం చెందిన రబింద్రనాథ్ టాగోర్ గారు, చాల సంవత్సరాల తరువాత ఒక సభలో వారిని తిరిగి కలిసారు. ‘మీరు ఆనాడు పాడిన బేహాగ్ రాగం ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతోంది. మీరు సంగీతం ఎవరిదగ్గర నేర్చుకున్నారు?’ అని అడిగారట. దానికి దాసుగారు చిరునవ్వుతో ‘దేవుడిదగ్గర’ అని సమాధానం చెప్పారుట. టాగోర్ గారు, ‘మీ కాలేజిలో ఉపయోగించే పాఠ్య ప్రణాళిక మాకు ఇస్తే విశ్వభారతి విశ్వవిద్యాలయంలో దానిని మేము ప్రవేశపెట్టుకుంటాము’, అన్నారుట.

ఆనాటి సంగీత సాహిత్య ప్రపంచం నారాయణ దాసుగారికి ‘సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వర’ మరియు ‘హరికథ పితామహ’ లాంటి బిరుదులతో సన్మానించింది. వీటిలో ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వర’ బిరుదులు వారి అనన్య సామాన్యమైన తాళజ్ఞాన ప్రతిభకి గుర్తింపు. దాసు గారు ఒక కీర్తన గానం చేసేటప్పుడు రెండు చేతులతో రెండు తాళాలు, రెండు భుజాలతో రెండు తాళాలు, తలతో ఐయదవ తాళం వేయగలిగే వారట. ఈ ప్రజ్ఞనే ‘పంచముఖి’ అంటారు.  ఈ ప్రజ్ఞను కూడా అధిగమించి నోటితో గానంచేసే కీర్తనను ఆరవ తాళంలో గానం చేయగలగడం ‘షణ్ముఖి’. ఈవిధంగా అయిదు, ఆరు తాళాలతో గానం చేసే సంగీత విద్వాంసులు వేరొకరు లేరు; ‘నభూతో నభవిష్యతి’ అనడం అతిశయోక్తి కానే కాదు.  

నారాయణ దాసుగారు ఎనభయ్యవ పడిలో ప్రవేసించేక భారతి తీర్థ అనే సాంస్కృతిక సంస్థ వారిని సన్మానించి బిరుదప్రదానం చేయాలని ఆహ్వానించింది. అప్పటికే ఆయనకు ఎన్నో సన్మానాలు,  బిరుదప్రదానాలు జరిగాయి. అంతవరకూ అందుకున్న బిరుదులన్నీ సంస్కృతంలో ఉన్నాయి కనుక ఈసారి ఆ సంస్థ ప్రదానం చేసే బిరుదు తెలుగులో ఉండాలని కోరేరుట శ్రీ దాసు గారు. సంస్కృతంలో గొప్ప పండితుడైన నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానం అలాంటిది. ఈ పద్యం ఆయన తెలుగు భాషాభిమానాన్ని విశదీకరుస్తుంది:

మొలక లేత తనము తలిరుల నవకము
మొగ్గ సోగతనము పూవు తావి
తేనే తీయదనము తెలుగునకే కాని
మొరకు కరకు దయ్యపు నుడికేది?

నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానాన్ని గౌరవించి భారతి తీర్థ, ‘ఆట పాటల మేటి’ అనే (తెలుగు) బిరుదుని ప్రదానం చేసి గౌరవించింది.

ఆ మహనీయుడు తెలుగు జాతికి అధ్బుతమైన, అనన్య సామాన్యమైన, అనితర సాధ్యమైన, అజరామరమైన సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారు. అయన ౧౫౦వ జయంతి సంవత్సరంలో వారిని స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి కనీస కర్తవ్యం.