Saturday, November 1, 2014

‘పూర్ణ పురుషుడు’, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు

ఇది శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి 150వ జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి ప్రచురించిన సంస్మరణ సంచికలో ప్రచురించబడిన వ్యాసం:
డా. ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి
ఉపోద్ఘాతము

సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖీ పరమేశ్వరుడు’, ‘హరికథా పితామహ’, ‘అట పాటల మేటి లాంటి ఎన్నో బిరుదులూ ఆయనను వరించాయి. ఆరున్నర దశాబ్దాల సంగీత, సాహిత్య, హరికథా కళా ప్రస్థానంలో ఆయన అందుకోని సన్మానం లేదేమో. రాజ సన్మానాలూ, పౌర సన్మానాలూ, బిరుద ప్రదానాలూ, గజారోహణలు, సువర్ణ ఘంటాకంకణ ధారణలూ, గండపెండేర ధారణలూ ఇలా ఎన్నో, ఎన్నెన్నో గౌరవాలు ఆయనకు లభించాయి.

ఆదిభట్ల నారాయణ దాసుగారు తెలుగులో, అచ్చతెలుగులో, సంస్కృతంలో సుమారు ఏభై గ్రంధాలను రచించారు. వాటిలో స్వతంత్ర కావ్యాలు, ప్రబంధాలు, అనువాద గ్రంధాలు, వచన గ్రంధాలు, కవితా సంపుటాలు, శతకాలు, వేదాంత పరిశోధనలు, సంగీత ప్రబంధాలు, హరికథలు, పిల్లల నీతికథలు వగైరా ఉన్నాయి. అన్ని కళలలో ప్రావీణ్యం గల ఆయనను 'ది హిందూ' పత్రిక (జూన్ 30, 1894) ‘బహుముఖ ప్రజ్ఞాశాలి అని శ్లాఘించింది. ఆ మహనీయుని సంగీత సాహిత్య పాండిత్యాన్ని సంగీత వైదుష్యము, “హరికథ సృష్టి, “సాహిత్య పరిచయం అనే విభాగాలలో పరికిద్దాం.

సంగీత వైదుష్యము

మేఘగంభీర శారీరము. లయ తాళ ప్రతిభ. అనన్యసామాన్యమైన గానకౌశలము: ఆదిభట్ల నారాయణ దాసుగారికి అనువంశికంగా కొంత, దైవానుగ్రహంచేత మిక్కిలిగా, స్వాభావికంగానే సంగీత జ్ఞానం అలవడింది. అయిదేళ్ళ వయసులోనే రాగయుక్తంగా భాగవత పద్యాలను చదివి, అదే భాగవత గ్రంధాన్ని బహుమతిగా పొందారాయన. ఎంతో విలువైనదిగా ఆయన పదిలపరచుకున్న ఆ భాగవత గ్రంధమే ఆయన జీవన గమనాన్ని నిర్దేశించింది. ‘నాకు అయిదేళ్ళ వయసునుండే పురాణము చదివి, లయజ్ఞానంతో పాడి ఇతరులను సంతోషపెట్టగలిగే నేర్పు అలవడింది’, అని ఆయన తన స్వీయచరిత్రలో చెప్పుకున్నారు. పెక్కు రాగవరసలలో పురాణములు అర్ధస్పూర్తిగా  చదవగల మేనమామలతో, కొంచం ఓపిక పట్టండి మీకంటే ఎక్కువగా రాగవరసలో చదువుతాను అని చిన్ననాడే ప్రతిజ్ఞ చేసి తన భవిష్య వాణిని వినిపించారు.‘పుస్తకాన్ని గిరగిర తిప్పుతూ శరవేగమున గీర్వాణాంధ్రములు చదువుట; ఒక్కసారి వినిన మాత్రమున గీర్వాణాంధ్రాంగ్లేయ పద్యముల మరల చదువుట; పల్లవిపాడుట; పెక్కురాగాములాలాపించుట; గీర్వాణాంధ్రములలో అనేక వృత్తములలో కవిత్వము చెప్పుట; అవధానము చేయుట; అపూర్వ కల్పనలతో ఆంధ్ర,, ఆంగ్లేయ భాషలలో వేలకొలది జనులుగల సభలలో పాడుచూ ఉపన్యసించుట నా విద్యలు’, అని అయన తన ప్రజ్ఞాపాటవాలను పరిచయం చేసుకున్నారు.

నారాయణ దాసుగారు వంతరాము అనేగ్రామంలో తనమేనమామల ఇంటిలో ఉండగా అక్కడికి వాసా సాంబయ్య అనే వైణిక విద్వాంసుడు వచ్చాడు. సాంబయ్యగారిది  సంగీత విద్వాంసుల  వంశం. ఆయన బొబ్బిలి సంస్థానంలో వైణిక విద్వాంసుడు. ఆయన నారాయణ దాసుగారి సంగీతాలాపనవిని  సంతోషించి ఆయన తలిదండ్రులతో ఈ పిల్లవాని కంఠంలో మాధుర్యం ఉంది; అంతేకాక ఇతనికి మంచి లయజ్ఞానం ఉంది. సంగీత శిక్షణ ఇస్తే మంచి గాయకుడు అవుతాడు. నాతొ బొబ్బిలి పంపండి. నేను సంగీతం నేర్పుతాను అన్నారు. అందుకు అంగీకరించిన తల్లితండ్రులు ఆ పిల్లవానిని సాంబయ్య గారితో బొబ్బిలికి పంపించారు. అప్పటికి ఆ పిల్లవాని వయసు పదకొండు సంవత్సరాలు.  శారదానుగ్రహమైన తన సంగీత ప్రతిభను ఆ వయసుకే గుర్తించిన దాసుగారు త్రోవలో సులభముగా చిక్కిన నన్ను శిష్యమిషపై పరిచారకునిగ కొని పోతున్నాడు అని స్వగతంగా అనుకొని గురువుగారి ననుసరించారు.  ఆయన ఆత్మ విశ్వాసం అవాస్తవం కాదని నిరూపించే సంఘటన ఒకటి ఆయన బొబ్బిలి చేరిన కొద్దిరోజులకే సంభవించింది.  

ఒకనాడు కోటలో భోజనానికని బయలుదేరిన దాసుగారు ఉత్సాహంగా పాడుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒకచోట ఎర్రని దుప్పటి కప్పుకున్న పండుముదుసలి ఒకాయన కూర్చొని ఉన్నాడు. అయన వదనం పాండిత్యశోభతో  ప్రకాసిస్తోంది. దాసుగారిని దగ్గరకు రమ్మని, ‘ఇప్పుడు నువ్వు పాడుతున్న పాట మళ్ళీ పాడు అని ఆదేశించాడు. దాసుగారు రెట్టించిన ఉత్సాహంతో ఉల్లాసంగా రాగాలాపన చేసారు. ఆ వృద్ధ పండితుడు ఆ పాటకు ఎంతో సంతోషించి చెంతనున్న వారితో విన్నారా ఈ పిల్లవానికెవరు నేర్పారో కాని శుభ పంతువరాళి రాగం ఎంత శ్రావ్యంగా పాడేడో! పూర్వజన్మ వాసన ఉండాలిగాని సంగీతం ఒకరు నేర్పితే వచ్చేది కాదు. అని ప్రశంసించేడు. దాసు గారిని ప్రశంసించిన వృద్ధుడు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. అయన పేరు తుమరాడ వెంకయ్య. అ వృద్ధ పండితుని ప్రశంస సత్యదూరం కాదు. ఎందుకంటే నిజానికి అంతవరకూ దాసుగారు ఇతరులు పాడితే విని, తనకు తానుగా పాడుకోడం తప్ప గురువుల ద్వారా సంగీతం నేర్చుకోలేదు. దాసు గారు అలవోకగా పాడిన పాట అప్రయత్నంగానే ఒక రాగక్రమంలో - అందులోను ఎంతో సాధన చేస్తేగాని పట్టుబడని కఠిన రాగవరుసలో - వెలువడింది అంటే  దానికి ఖచ్చితంగా శారదాదేవి అనుగ్రహమే కారణం అయిఉండాలికదా!

ఆ తరువాత వెంకయ్య గారు దాసుగారి పూర్వాపరాలు విచారించి సంగీతం నేర్చుకోడానికి బొబ్బిలి వచ్చాడని తెలుసుకొని తన ఇంటిలో ఒక వారం ఇస్తానని మాట ఇచ్చాడు. ఆరోజుల్లో గురుకుల పద్ధతిలో జరిగే విద్యాభ్యాసం కొనసాగాలంటే విద్యార్ధులకు వారంలోని ఏడు రోజులూ ఏడుగురు గృహస్థుల ఇళ్ళలో వారం కుదరాలి. దాసుగారికి ఎంత ప్రయత్నించినా ఏడు వారాలు లభించలేదు. ఒక నెల పాటు బొబ్బిలిలో కష్టాలకోర్చి తన స్వగ్రామానికి తిరిగి రాక తప్పలేదు. దీని పర్యవసానం ఏమిటంటే దాసుగారి గురుముఖమైన సంగీత శిక్షణ ఒక నెలలో ముగిసింది. ఆ తరువాత  అంతా స్వయం కృషి, దైవానుగ్రహమే!  అందుకే కొన్ని దశాబ్దాల తర్వాతి కాలంలో చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు దాసుగారిని 'పుంభావ సరస్వతి, అని కొనియాడితే ఆ ప్రశంస స్వభావోక్తే కాని అతిశయోక్తి కానేకాదు.    

దాసుగారి సంగీత యాత్రలో (జైత్ర యాత్ర ఇంకా ముందుంది!) రెండవ అధ్యాయం విజయనగరానికి మకాం మార్చడంతో మొదలయింది. ఇంగ్లీషు విద్య నేర్చుకొంటే ఏదైనా ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపదతాడనే ఉద్దేశంతో దాసుగారి తల్లిదండ్రులు ఆయనను తన రెండవ అన్న సీతారామయ్యగారి ఇంటికి విజయనగరం పంపించారు. న్యాయవాద వృత్తిలో ఉన్న సీతారామయ్యగారు విజయనగరంలో కానుకుర్తివారి వీధిలో నివాసం ఉండేవారు. అప్పటినుండి విజయనగరమే దాసుగారి స్థిరనివాసం అయింది. విజయనగరం మహారాజావారి ఆస్థాన సంగీత విద్వాంసుడు నిరాఘాటం క్రిష్ణయ్యగారు సీతారామయ్యగారి ఎదురింట్లో కాపురం ఉండేవారు. ఆయనవద్ద సంగీతం నేర్చుకోమని దాసుగారిని ఆయనకు అప్పగించారు, వారి తండ్రిగారు. క్రిష్ణయ్యగారు సంగీతం పాడేటప్పుడు తల, చేతులు,  మొహం, కళ్ళు ఎలా తిప్పుకుంటారో ఆ అభినయం అంతా దాసుగారు నేర్చుకోడమే కాకుండా అంతకంటే ఒకపాలు ఎక్కువగా చేయడం మొదలు పెట్టారు.  దాంతో గురువుగారికి చాలా కోపం వచ్చింది. దాసుగారి తండ్రితో శాస్త్రిగారూ మీ అబ్బాయి నన్ను వెక్కిరిస్తున్నాడు. వాడికి నేను పాఠం చెప్పను అని ఆయన తప్పుకున్నారు. ఆవిధంగా గురువుదగ్గర సంగీతం నేర్చుకునే ఇంకొక (నిజానికి ఆఖరి) అవకాశం కూడా దాసుగారు పోగొట్టుకున్నారు. ఇక అంతా స్వయంకృషి, దైవకృపే. అయితే ఈవృత్తాంతంతో దాసుగారిలో నిక్షిప్తంగా ఉన్న ఇంకొక కళ బహిర్గతం అయింది. అదే నటన. దానిగురించి వారి హరికథా సృష్టి, ప్రదర్శనకృషి విషయప్రస్తావన వచ్చినపుడు పరిశీలిద్దాం. 

ఆ రోజుల్లో విజయనగరం నిజంగా విద్యల నగరమే! విజయనగర రాజకుటుంబాలకు ఉత్తరదేశంతో, ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని  రీవా సంస్థానంతో సంబంధాలు ఉండేవి. ఆకారణంగా విజయనగర రాజాస్థానంలో అనేక ప్రాంతాలనుంచి వచ్చిన కవులూ, గాయకులూ, ఇతర కళాకారులూ ఉండేవారు. ఒకవిధంగా చెప్పాలంటే అప్పటి విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు, భోజరాజుల విద్వత్సభలను తలపించేది.

కర్ణాటక-హిందుస్తానీ సంకీర్ణ బాణీ రూపకల్పన: నారాయణ దాసుగారు ఏకసంతగ్రాహి. నీరు భూమిలో ఇంకినట్టు ఆయన విద్యలను అంతర్గతం చేసుకునేవారు. విజయనగర రాజాస్థానంలో మొహబ్బత్ ఖాన్ అనే హిందుస్తానీ సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అయన సాంగత్యంలో దాసుగారు హిందుస్తానీ సంగీత బాణీని ఆకళింపు చేసుకున్నారు. దానితో, అప్పటికే కర్నాటక సంగీతంలో ప్రావీణ్యం ఉన్న అయన అనుసరణలో, ఆ రెండు సంప్రదాయాల మేలుకలయికగా, ఒక కొత్త సంప్రదాయం, ‘కర్ణాటక-హిందుస్తానీ సంగీతాల సంకీర్ణ బాణీ వెలువడింది. (అలాగే కొంతకాలం పిదప, అంటే ముప్ఫైఏడు సంవత్సరాల వయసులో ఒక మౌల్వి సాంగత్యంవల్ల ప్రేరేపితులై, దాసుగారు అరబిక్, పెర్షియన్ భాషల పుస్తకాలు తెప్పించుకుని తనకు తానే గురువై ఆ భాషలు నేర్చుకున్నారు. ఆ అధ్యయనం వారు సుమారు అరవై సంవత్సరాల వయసులో చేపట్టిన ఒమర్ ఖైయం రూబాయిల అనువాద రచనకు నాంది పలికింది.)

కాలక్రమేణా నారాయణ దాసుగారు విజయనగర సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా నియమితులయినపుడు, ఆయన రూపకల్పన చేసిన కర్ణాటక-హిందుస్తానీ సంగీతాల సంకీర్ణ బాణీ ఆ కళాశాల పాఠ్యప్రణాళికలో భాగం అయింది. విజయనగరం సంగీత కళాశాలలో సంగీత విద్యనభ్యసించిన విద్వాంసులు ఈనాటికీ ఆ బాణీని అనుసరిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఆ సంప్రదాయానికి నారాయణ దాసుగారే ఆద్యుడనే గుర్తింపు రాలేదు. దానిని 'విజయనగరం సంగీత బాణీ'గా పిలుస్తారు.

దక్షిణ భారత దేశంలోనే మొట్ట మొదటిదయిన శ్రీ విజయరామ గాన పాఠశాల స్థాపన వెనుక గల ముఖ్య కారణాన్ని ఇక్కడ వివరించాలి. ఆ కాలేజి 1919లొ స్థాపించబడింది. అప్పటికే నారాయణ దాసు గారి ప్రజ్ఞా పాటవాలు కలకత్తా నుండి కన్యాకుమారి వరకు వ్యాపించాయి. వారికి మైసూరు రాజ దర్బారులో జరిగిన ఘన సన్మానం గురించి, మదరాసులో వారి హరికథా ప్రదర్శనలకు అందుతున్న ప్రశంసల గురించి హిందూ, మెయిల్ లాంటి పత్రికలూ వార్తలు ప్రచురిస్తూనే ఉన్నాయి. అయితే అంతవరకూ విజయనగర రాజ దర్బారులో మాత్రం వారికి ప్రవేశం లేదు. దానికి కారణం అక్కడి ఆస్థాన విద్వాంసుల అసూయ, అసహనాలే. ఈ విషయం అర్ధం చేసుకున్న రాజావారు తమవల్ల అసంకల్పితంగానే అయినా, జరిగిన పొరపాటును సరిదిద్దాలనుకున్నారు. అయితే దాసుగారిని ఏవిధంగా సన్మానించాలి? ఆయనకు అప్పటికే అనేక సన్మానాలు బిరుదప్రదానాలు జరిగాయి. ఈ విషయంపై లోతుగా ఆలోచించిన రాజుగారు ఒక సంగీత కళాశాలను స్థాపించి దానికి దాసుగారిని ప్రిన్సిపాలుగా నియమిస్తే, వారిని గౌరవించినట్టూ అవుతుంది వారి శిక్షణలో ఔత్సాహికులయిన విద్యార్థులను తీర్చిదిద్దినట్టూ అవుతుందనే నిర్ణయానికి వచ్చారు. అయితే రాజావారి ప్రతిపాదనకు నారాయణ దాసుగారు మొదట అంగీకరించలేదు. ఎందుకంటే వారికి మానవమాత్రుల వద్ద కొలువు చేయను అనే నియమం ఉంది. ఆ కారణంగానే అయన అంతకుముందు  తమకొలువులో ఆస్థాన సంగీత విద్వాంసులుగా రమ్మని కోరిన మైసూరు మహారాజు ఆహ్వానాన్ని తిరస్కరించారు. అయితే ఆనంద గజపతి రాజుగారు మాత్రం పట్టువిడవక దాసుగారిని అదే ప్రతిపాదనతో అనుసరిస్తూనే ఉన్నారు. చివరికి దాసుగారే ఒక పరిష్కార మార్గం సూచించారు. సంగీత కళాశాలను ఒక రామాలయంగా భావించి తాను రామ సేవకుడుగా పనిచేస్తానని ప్రతిపాదించారు. దానికి రాజుగారు సంతోషంగా అంగీకరించారు. అప్పుడు దాసుగారు శ్రీరాముని చిత్రపటాన్ని ఆ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో ప్రతిష్టించి బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఇరవయి సంవత్సరాలు పనిచేసి 1936లొ తన డెబ్భైఒకటవ ఏట పదవీ విరమణ చేసారు.  ఆ ఇరవయి సంవత్సరాలలో ఆ కళాశాల ఎంతోమంది సంగీత విద్వాంసులను తీర్చిదిద్దింది. అంతకు చాల సంవత్సరాలకు ముందు కలకత్తాలో దాసుగారి హరికథా ప్రవచనాన్ని విని ముగ్ధులైన విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్, ఆ కళాశాలలో అనుసరిస్తున్న పాఠ్యప్రణాళికను విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రవేశ పెట్టాలని కోరుకున్నారుట.

రవీంద్రనాథ్ టాగోర్ గారితో నారాయణ దాసుగారి సమాగమం రెండు, మూడు సార్లు జరిగింది. మొదటిది 1910లొ వారు కలకత్తాలో శ్రీకృష్ణ జననం సంస్కృత హరికథ గానం చేసినప్పుడు. ఆప్రదర్శనలో దాసుగారు సంస్కృతంలో కీర్తనలు గానం చేస్తూ హిందీలో కథా ప్రవచనం చేస్తూ మూడున్నర గంటలసేపు ప్రేక్షకులను మైమరపింపచేరు. ఆ హరికథను ఆసాంతం విన్న టాగోర్ గారు వేదికమీదకి వచ్చి దాసుగారిని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలియచేసి 'ఇంతటి అమర గానాన్ని ఎవరివద్ద అభ్యసించారు' అని ప్రశ్నించారు. దానికి దాసుగారు చిరునవ్వుతో 'దేవునిదగ్గర' అని సమాధానం ఇచ్చేరుట. ఈ ఉదంతానికి సుమారు ఇరవైఅయిదు సంవత్సరాలకు ముందు, అంటే దాసుగారు హరికథా వృత్తిని తన జీవన ప్రవృత్తిగా ఎంచుకున్న తొలిరోజులలో జయంతి కామేశం పంతులు అనే కళాపిపాసి అయిన న్యాయవాదిని బరంపురంలో కలియడానికి వెళ్లారు. మీరెవరు అని ప్రశ్నించిన పంతులుగారికి మానవ రూపంలో ఉన్న గంధర్వుడను అని సమాధానం ఇచ్చారు దాసుగారు. అప్పటి ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా టాగోర్ గారికి ఇచ్చిన సమాధానంలో ప్రతిధ్వనించింది. వారి పునస్సమావేశం కొన్ని సంవత్సరాల తరువాత జరిగింది. ఒక  విద్వత్సభలో పాల్గొనడానికి వచ్చిన టాగోర్ గారు ఎక్కడో దూరంగా కూర్చున్న దాసుగారిని గుర్తించి దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నల తరువాత మీరు ఆనాడు కలకత్తాలో పాడిన బేహాగ్ రాగం ఇంకా నా చెవులలో ప్రతిధ్వనిస్తోంది అని ప్రసంసించేరు.

నారాయణ దాసుగారి సంగీత జైత్ర యాత్ర మొదటి అంకం వారి ఎఫ్. ఎ. విద్యాభ్యాసం తరువాత ఏలూరు, బందరు, రాజముండ్రి, కాకినాడల పర్యటనలతో మొదలైంది. అంతకుముందు వారు శ్రీకాకుళం జిల్లా, ఒదిషాలలో జరిపిన సాహిత్య పర్యటనలు హరికథ, అవధాన ప్రదర్శనలకు పరిమితం. ఆ పర్యటనలో వారి మొదటి స్పర్థ ఏలూరులో పల్లవిలో తనంత వాడు లేదని డాబు కొట్టుచున్న ఒక విద్వాంసునితొ జరిగింది.  అతను చతురస్ర గతిలో పాడుచున్న పల్లవిని త్ర్యస్య గతికి మార్చి పాడ జొచ్చెను. దాసుగారు మునుపటి చతురస్ర గతిని చేతనిల్పి నోటితో త్ర్యిస్ర గతిలో పాడినచో మీ లయ జ్ఞానము ప్రౌఢమని ఒప్పుకొందును అని సవాలు విసిరారు. అతడెన్నిసారులు ప్రయత్నించిననూ ఆ విధంగా చేయడం అతనివల్ల కాలేదు. అపుడు దాసుగారు ధారాళముగా భిన్నగతులలో పల్లవిపాడి తన తాళజ్ఞాన ప్రతిభను నిరూపించారు.

బందరులో నారాయణ దాసుగారు బసచేసిన ప్లీడరు గారి ఇంట్లో సంగీత సభ జరిగింది. ఆ సభలో అనేకమంది  సంగీత విద్వాంసులు - గాయకులూ, మార్దంగికులు, ఫిడేలర్లు - కలరు. ఆ సభ ఏర్పాటు చేసిన గృహస్తు దాసుగారిని కూడ పల్లవి పాడమని కోరెను. దాసుగారు నాల్గవ కాలమున ఆరక్షరములు జాగాచేసి పాడుచున్న పల్లవిని అయిదవ కాలము విలంబముగా మార్చి ఒంటి అక్షరము జాగా చేసి మూడావ్రుత్తములు పాడేరు. ఆ సభలో పాలుపంచుకుంటున్న గాయకులుగాని, మార్దంగికులుగాని, ఫిడేలర్లుగాని, కొలిపించు విద్వాంసులుగాని లయ కణికము కాచుకొనలేక జాగా తెలిసికొనలేక తడ బడ్డారు. దాసుగారు జాగా వెల్లడి చేసినతరువాత కూడ ముక్తాయింపలేకపోయారు. అయితే ఈ కధ అక్కడితో ముగిసిపోలేదు. కొంచెం  అంతరాయం తరువాత తిరిగి మొదలైంది. ఆ అంతరాయంలో దాసుగారు అష్టావధానం ప్రదర్శించారు.     

అసాధ్య / సంగీత అష్టావధానం:  నారాయణ దాసుగారు తన పంథొమ్మిదవ ఏట హరికధా ప్రదర్సనలతో సమాంతరంగా అవధాన ప్రక్రియ ప్రదర్సన కూడా మొదలు పెట్టారు. అయితే అయన అష్టావధానాలు తక్కిన వారి అష్టావధానాలకు భిన్నంగా, అయన సంగీత సాహిత్య ప్రతిభకు, బహుభాషా పాండిత్యానికి దర్పణాలుగా ఉండేవి.  ఉదాహరణకు, అయన అష్టావధానాలలో వ్యస్తాక్షరి గ్రీకు భాషలో ఉండేది. నారాయణ దాసుగారు బందరులో పంతులుగారి మేడమీద ప్రదర్శించిన అష్టావధానం ప్రవేశ రుసుముతో జరిగింది. సంగీతానికి సంబంధించిన అంశాలు అందులో ఉండడం దాని ప్రత్యేకత.  రెండు పాదములతో రెండు తాళములు, రెండు చేతులతో రెండు తాళములు వేసి పల్లవి పాడుచూ కోరిన జాగాకు ముక్తాయిలు వేయుట, నలుగురకు తెలుగున, నలుగురకు సంస్కృతమున కోరిన పద్యములు కవిత్వము చెప్పుట, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, గణిత శాస్త్ర సమస్యను సాధించుట, పూలు, గంటలు లెక్కించుట, ఛందస్సంభాషణ, ఇంగ్లీషులో ఉపన్యాసము మొదలైనవి, ఆ అష్టావధానంలో అంశాలు. శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు యక్షగాన రూపంలో రచించిన నారాయణ దాస జీవిత చరిత్ర లో నారాయణ దాసుగారి సంగీత / అసాధ్య అష్టావధానాన్ని ఈ విధంగా వర్ణించారు:

ఇరు హస్తములతోడ జెరియోక తాళంబు
చరణద్వయాన నేమరక రెండు
పచరించి, పల్లవిబాడుచు గోరిన
జాగాకు ముక్తాయి సరిగా నిడుట
నయమొప్ప న్యస్తాక్షరియును వ్యస్తాక్షరి
ఆంగ్లంబులో నుపన్యాస, మవల
నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ
తంబున వలయు వృత్తాల గైత,
సంశయాంశంమ్ము శేముషీ శక్తితో బ
రిష్కరించుట, గంటలు లెక్కగొంట
మరియు ఛందస్సుతోడి సంభాషణంబు
వెలయు నష్టావధానంబు సలిపె నతడు   

నారాయణ దాసు గారు అష్టావధానం చేసిన మరునాడు, బుధవిదేయిని అనే స్థానిక పత్రిక ఆ అవధానం గురించి వ్యంగ్యంగా బ్రహ్మశ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు చిన్నపనులగుంపు చేసేరు అని వ్రాసింది. నారాయణ దాసుగారు దానికి  తీవ్రంగా  స్పందిస్తూ, ‘కలుషహారిణి అనే ఇంకొక స్థానిక పత్రికలో ఇలా ప్రకటన ఇచ్చారు: నారాయణ దాసుగారు చేసినది అసాధ్య అష్టావధానము, సంగీత సాహిత్యములలో ఇట్లవధానములు చేయు సమర్ధత ఇంకోక్కనికుండుట దుర్ఘటమని ఏల వ్రాయకూడదు; నా అష్టావధానము గ్రహించి వ్రాయుటకు కేవల సాహిత్యజ్ఞుడగు బుధవిదేయిని ప్రకటనకర్త సమర్ధుడు కాదు;  పైగా నా ప్రతికక్షులలో చేరియుండుటచే అట్లు వ్రాసెను. ఆ ప్రకటనతో బుధవిదేయిని’, కలుషహారిణి పత్రికల మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. నారాయణ దాసుగారి సమర్ధకులు, ప్రత్యర్ధులు ఇరువైపులనుండి వ్యాసపరంపరలతో పోట్లాడుకున్నారు. చిలికి చిలికి గాలివాన అయినట్లీ ఒక పెద్ద సాహిత్య దుమారమే చెలరేగింది.

ఈలోగా, అంతకుముందు పల్లవి ప్రదర్శనలో పరాజితులైన దాసుగారి ప్రతికక్షులు సంగీతంలో ఆయనను ఓడించాలనే ఉద్దేశంతో ఒక సభ చేసి, చేతనయితే అందులో వారితో పోటీకి రావాల్సిందిగా వర్తమానం పంపేరు. నారాయణ దాసుగారు ఆ సవాలును స్వీకరించి ఆ సభకు హజరయ్యారు.  అయన హుందాగా సభలో ప్రవేసించినంతనే బ్రావో అనే హర్షధ్వానాలు మిన్నుముట్టేయి. ఆ సభకు అధ్యక్షత వహించిన నారాయణ దాసుగారి ప్రత్యర్ధి (ఒక వకీలు), “నారాయణ దాసుగారు ఇక్కడ ఉన్న ఇరవై మంది సంగీత విద్వాంసులు విద్యయందు తమకు చాలరని ప్రకటించినందుకే ఈ పోటీ సభ నిర్వహించబడింది. కనుక వీరు వేయు ప్రశ్నలకతను సమాధానము చెప్పవలెను. ఈ శాస్త్ర పరీక్షలో అతను నెగ్గినచొ అతడందరికన్నా గొప్ప సంగీత విద్వాంసుడని అంగీకరించబడును. లేనిచో అతడు అందరికి క్షమాపణ చెప్పవలెను అన్నారు . అప్పుడు నారాయణ దాసుగారు లేచి సభికులారా, ఈ విద్వాంసులందరూ సంగీతమున నాకు లోకువయని వీరలు నన్ను తిరస్కరించినపుడెల్ల నేనన్నమాట నిజమే. సంగీత విద్వాంసులమనుకొన్నవారిలోనే సంగీత తత్వము తెలిసినవారుంట అరుదన తక్కినవారి గురించి చెప్పనేల? కావున మాకు మధ్యస్థులై మీరు ఉండుట అసాధ్యము. ఇప్పుడు వీరు సంగీత శాస్త్రమున నన్ను పరీక్షించుటకు అనర్హులు. కారణమేమన సంస్కృతభాష కొంచెమైనను వీరికి తెలిసినట్లు కాన్పించదు. సంస్కృత భాషాజ్ఞాన మిసుమంతయులేని వారికి సంస్కృతమున వ్రాయబడిన సంగీత శాస్త్రమన్వయింప బడదు కదా? కావున సంగీత శాస్త్రములోని సూత్రములు కాని పద్యములు కాని నేను చదివితే వీరికి అర్ధమే కాదు. కనుక శాస్త్ర చర్చ నాతొ చేయుటకు వీరు తగరని స్పష్టము.  ఇక శ్రోతృరంజక స్వరసందర్భము సంగీతము. కనుక వీరందరును కలిసి ఒక గంట పాడనిండు. పిదప నేను ఒక గంట పాడెదను. ఎవరి పాట మిక్కిలి రంజకముగా ఉండునని మీకు తోచునో వారధికులుగ నిర్ణయింపబడుడురు. ఇది నా మనవి అన్నారు. అప్పుడు సభాధ్యక్షులు లేచి, ఉభయుల వాదనలు విన్నాము. శాస్త్ర వాదమగునప్పుడు తగువు తీర్చుటకు మేమనర్హులము. ఉభయ కక్షల వారు పాడి సభారంజకమొనర్చుట మా కోరిక అన్నారు. అందుకా ప్రతికక్షులు మీ అందరికి రక్తి చేయుటకు ఈ సభ నిర్వహించబడలేదు అని ఇంకా వారి అక్కసు అంతా వెళ్ళగక్కేరు. దానికి నారాయణ దాసు గారి శిష్యుడొకడు దీటైన సమాధానం ఇచ్చేడు. రణగొణధ్వనుల మధ్య సభ ముగిసింది.  

బందురులో నారాయణ దాసుగారి ప్రతికక్షులలో ముఖ్యుడు హరి నాగభూషణం గారనే సంగీత విద్వాంసుడు. నారాయణ దాసుగారి పత్రికా ప్రకటనకు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసి వ్యాస పరంపరల యుద్ధం మొదలు పెట్టింది ఆయనే. ఇంత జరుగుతున్నా నారాయణ దాసుగారు అందులో జోక్యం చేసుకోలేదు. అలా కొన్ని నెలలు సాగిన యుద్ధం చివరకు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి జోక్యంతో ముగిసింది. నాగభూషణం గారు ఉపసంహారం అనే పేర బుధవిదేయిని పత్రికలో వ్రాసిన వ్యాసంతో డొంకతిరుగుడుగా క్షమాపణ చెప్పారు.  బుధవిదేయిని పత్రిక సంపాదకులు పురుషోత్తమ రావు గారు తమ కుమారుని నారాయణ దాసు గారింటికి పంపారు. ఆ అబ్బాయి నారాయణ దాసుగారిని కలిసి 'మా నాన్నగారు నమస్కారాలు తెలపమన్నారు' అని తెలిపాడు. ఆ కధ అంతటితో సుఖాంతం అయింది. అయితే దానికి కొసమెరుపు లేక పోలేదు. అప్పటికి కొన్ని దశాబ్దాల తరువాత అంటే 1932 లొ బందరు పట్టణంలో హరి నాగభూషణం గారే అధ్యక్షత వహించిన సంగీత విద్వాంస సభలో నారాయణ దాసుగారి స్వరాక్షర కృతులను ఆచార్య పి. సాంబమూర్తి ప్రభ్రుతులు ఎంతో కొనియాడారు. (ఆచార్య సాంబమూర్తిగారు 15-9-1932 న వ్రాసిన లేఖను బట్టి దాసుగారు 1927 లో మదరాసులో జరిగిన అఖిల భారత సంగీత పరిషత్తు ప్రారంభోత్సవ సభలో కొన్ని లోకోత్తరములైన స్వరాక్షర కృతులను గానం చేసినట్లు తెలుస్తున్నది.)       

కలకత్తా నుండి కన్యాకుమారి వరకు సాగిన దాసు గారి సుదీర్ఘ సంగీత జైత్ర యాత్రలో రెండు ముఖ్య అధ్యాయాలు ఉన్నాయి. అవి మదరాసు, మైసూరు. నగరాలలో ఆయన సాధించిన విజయాలు. సంగీత ప్రజ్ఞా ప్రదర్సనలోను రసికతలోను మదరాసు నగరం మరియు మైసూరు రాజ దర్బారు ముఖ్యంగా పేర్కొనదగినవి. ఈరెండు ప్రదేశాలలోనూ దాసుగారి సంగీత ప్రజ్ఞకి అమోఘమైన కీర్తి గౌరవాలు లభించాయి. మైసూరు సంగీత దుర్గంలో తన జండా ఎగరవేయాలనే సంకల్పంతో బయలుదేరిన దాసుగారు మొదట మదరాసులో మజిలీ చేసారు. మదరాసులోని మైలాపూరు కపాలీశ్వర దేవాలయంలో దాసుగారు చేసిన అంబరీష చరిత్రము హరికధను హిందూ, మెయిల్ ఆంగ్ల వార్తా పత్రికలు గొప్ప ప్రశంసలతో సమీక్షించాయి. అందులో హిందూ పత్రిక దాసుగారివంటి ఘనగంభీర మధుర ధ్వని ఇదివరకెన్నడు వినలేదని వ్రాస్తూ, పైన పేర్కొన్నట్టుగా ఆయనను బహుముఖ ప్రజ్ఞాశాలి (Versatile Genius) అనీ, అయన ఆంధ్ర దేశానికే గర్వకారణం (Pride of Andhra) అనీ అభివర్ణించింది. ఇక్కడ అంబరీష చరిత్రము రచన గురించి ఒక విషయం ప్రస్తావించాలి. అది దాసు గారు రచించిన రెండవ హరికథ. దాసుగారు మొదటి సంగీత సాహిత్య యాత్ర (1884) లో భాగంగా ఛత్రపురం (ఒదిష) లో వరుసగా హరికథలు చెప్పారు. అంతవరకూ ఆయన అన్ని సభల్లోనూ ప్రదర్శించినది వారు మొదట రచించిన హరికథ ధ్రువ చరిత్ర మాత్రమే. అక్కడ ఒక సంపన్న గృహస్తు ఇంటిలో ధ్రువ చరిత్రనే ప్రదర్శించారు. సభికులందరూ హర్షామోదాలు తెలిపారు కాని అ గృహస్తు మాత్రం ఇంత చిన్నవాడివి; ఇంత సొగసుగా కవిత్వం చెప్పేవంటే నమ్మేదెలా? నువ్వు నిజంగా కవిత్వము చెప్పగలవాడవే అయితే, అంబరీష చరిత్రము రచించి చెప్పగలవా? నీకు పదిరోజులు గడువిస్తాను అన్నాడు. ఆ రాత్రికి రాత్రే దాసుగారు అంబరీష చరిత్రము రచించి ఆ మరునాడే ప్రదర్శించారు. ఆ హరికథ రచించే సమయానికి వారి వయసు నిండా ఇరవై సంవత్సరాలు లేదు.  అయినా అంబరీష చరిత్రము రచనా శిల్పము ఎంతో పరిపక్వము చెందిన కవి రచించిన కావ్యంలా అనిపిస్తుంది. అలాగే అందులో వెలువరించిన వేదాంత సారం వారు పరిణత వయసులో రచించిన జగజ్జ్యోతి (1939-43) లో వివరంగా ప్రస్తావించారు. నిజానికి జగజ్జ్యోతి ఒక దర్శన శాస్త్ర గ్రంధం. దానికి అంకురార్పణ వారి చిన్నవయసులోనే జరిగిందన్నమాట.

మైసూరు రాజ దర్బారులో దాసుగారి ప్రవేశం ఎంతో ఆసక్తికరంగా, మరపురానివిధంగా, ఆంధ్రులంతా గర్వపడే విధంగా జరిగింది. దానిని వివరించేముందు మదరాసులో జరిగిన దాసుగారి మేఘగంభీర స్వరానికి, తాళజ్ఞాన ప్రతిభకి ఉదాహరణగా నిలిచే ఒకటి రెండు ఉదంతాలూ, 1904లొ బెంగుళూరులో జరిగిన దాక్షిణాత్య గాయక మహాసభ వృత్తాంతం ప్రస్తావించాలి. దాక్షిణాత్య గాయక మహాసభ దాసుగారికి లయబ్రహ్మ అనే బిరుదు ప్రదానం చేసింది.

పనప్పాక్కం అనంతాచార్యులు గారనే హైకోర్టు వకీలు మదరాసులో దాసుగారికి ఆతిధ్యం ఇచ్చారు. అయన గ్రోలు 'దొర' అనే బ్రిటిష్ ప్రభుత్వ ఉన్నతోద్యోగి ఇంటికి తీసుకుని వెళ్లారు. గ్రోలు 'దొర' గారి భార్య దాసుగారి వీణా వాదన విని చాల ఆనందించింది. ఆ తరువాత దాసుగారు తన గాత్రసంగీతం వినిపించారు. అదికూడా శ్రీమతి గ్రోలుకు చాల రుచించింది కాని శ్రీ గ్రోలుకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోవడంవల్ల అయన పెద్దగా ప్రభావితుడవలేదు. అప్పుడు దాసుగారు, అయ్యా ఇక్కడికొక ఫర్లాంగు దూరములో ట్రైనులు వస్తూ, పోతూ   కూతలు పెట్టుచున్నవి కదా. గమనించండి నేను పాడుతున్నంతవరకు మీకు ఆ ధ్వని వినపడనీయకుండా చేస్తాను అన్నారు. అలాగే అయన పాడుతున్నంతవరకూ అ దంపతులిద్దరకూ రైలుబండి శబ్దాలు వినపడలేదు. మేఘ గర్జనలాంటి అయన ఘన గంభీర స్వరం రైలు కూతలను సహితం అధిగమించి వినపడకుండా చేసింది. ఈసారి దొరగారు కూడా ఎంతో సంతోషించి, రామనాధపురం రాజావారికి సిఫారసు చేస్తాను అక్కడకు వెళ్తారా  అని అడిగారు. కాని దాసుగారెందుకో దానికి అంగీకరించలేదు.

ఆ రాత్రి మదరాసు నుండి రైలులో బెంగుళూరు బయలుదేరారు. కాని గుడియాత్తమ్ స్టేషనులో ఎవరో ఆయనను బిగ్గరగా పేరుపెట్టి పిలిచేరు. విషయం ఏమిటో కనుక్కుందామని రైలు దిగి ఆ వ్యక్తిని కనుక్కుంటే టెలిగ్రాము చేతిలో పెట్టేడు. ఒక ముఖ్యమైన సంగీత కచేరిలో పాడాలని, వెంటనే మదరాసుకు తిరిగిరమ్మని, దాని సారాంశం. దాసుగారికి మదరాసులో ఆతిధ్యం ఇచ్చిన పంతులుగారు పంపించారాది. వెంటనే తిరుగు ప్రయాణమై ఉదయానికి మదరాసు చేరుకున్నారు, దాసుగారూ ఆయనతో ఎప్పుడు నీడలా వెన్నంటే ఉండి, వంతపాట పాడుతుండే అయన నాలుగో అన్న పేరన్నగారూ.  

ఆ రోజు సాయంత్రం మదరాసు పోలీసు కమిషనరు గారి ఇంట్లో కచేరి. చీఫ్ జస్టిస్ మొదలు ఎంతో మంది పురప్రముఖులు విచ్చేశారా సభకు. పేరుపొందిన మద్దెల, ఫిడేలు వాద్యకారులను ప్రక్కవాద్యాలకి నియమించారు. దాక్షిణాత్యులకన్నాఔత్తరాహులు సంగీతంలో తక్కువవారని అక్కడి వారి అభిప్రాయం. ఆ భావానికి అనుగుణంగానే ఆ మార్దంగికుడూ, ఫిడేలరు, ఘటవాదకుడూ దాసుగారిని అలక్ష్యంగా చూడడం మొదలుపెట్టరు. దాసుగారు నటభైరవి పాడుతున్నారు. హరికథా కాలక్షేపము చేయువాడు ఇంతసాహసముగా సంగీత కచేరి చేయడానికి పూనుకున్నాడు వీడి బండారం పల్లవిలో బయటపెట్టాలని, ఇంక పల్లవి ఎత్తుకోండి అన్నారు, మార్దంగికుడూ, ఫిడేలరు. అయితే దాసుగారు విషమోద్-గ్రాహమున పల్లవి పాడుతూ ఫిదేలరును, మార్దంగికుని చూచి తానము పాడుచుండగా పల్లవి, పల్లవి అని తొందరపెట్టేరు; ఒకసారి అయినా జాగాకు రాలేరు; ముక్తాయింపలేకున్నారు; కాలమున్దరిమివేయుచున్నారు; విలంబకాలమునకు పనికిరారు అన్నారు. అందుకు ఆ విద్వాంసులు తమకు భాష అర్థం కానట్టు నటించి ఏదో  గొణుగుకున్నారు. అయితే ఆ సభలో వేంచేసిన ప్రముఖులంతా దాసుగారి శారీరమును, లయ జ్ఞానమును, పల్లవి పాడుటలో ప్రతిభను మెచ్చుకొన్నారు.

లయబ్రహ్మ బిరుదు ప్రదానం: బెంగుళూరులో దాక్షిణాత్య గాయక మహాసభ 1904లొ జరిగింది. అప్పటికే సంగీతజ్ఞుడుగా, హరికథా చక్రవర్తిగా దాసుగారి కీర్తి ప్రతిష్టలు ఆకాశన్నంటుతున్నాయి కనుక ఆ సభలలో హరికథ చెప్పాలని వారికి ఆహ్వానం వచ్చింది. దాసుగారి స్థాయికి తగ్గట్టుగా ప్రక్కవాద్యాలకి ప్రవీణులైన మృదంగ, వయోలిన్ విద్వాంసులను ఏర్పాటుచేసారు. అయితే ఆ మార్దంగికునికి 'కేవలం ఒక హరిదాసుకి' ప్రక్క వాద్యం అందించటం అంతగా రుచించలేదు. తన లయ పాండిత్యం ప్రదర్శించి 'హరిదాసు' కంటే గొప్పవాడినని అనిపించుకోవాలని కథ మొదలవగానే జోరుగా వాయించడం మొదలు పెట్టాడు. దాసుగారికి ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. వాటిని తిప్పికొట్టడం కూడా కొత్త కాదు. జంపెతాళపు కీర్తననెంచుకొని ఒకగతిలో పాడుతూ ఇంకొక గతిలో చిడతలు వాయించడం మొదలు పెట్టారు. మార్దంగికునికి ఏంచేయాలో తోచలేదు. కొంచంసేపు తంటాలుపడి ఇక వాయించడం మానేసి చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. అప్పుడు దాసుగారు ఏంస్వామీ వాయించడం మానేసేరు అనడిగేరు. అందుకాయన జాగా దొరకలేదు స్వామీ అని సమాధానం ఇచ్చేడు.  ఆ మార్దంగికుడిని సున్నితంగా మందలించి జాగా వెల్లడి చేసారు. అయన అదివరకులానే ఒకగతిలో పాడుతూ రెందోగతిలో తాళంవేస్తూ మూడవ గతిలో నృత్యం చేసారు. ఆ ప్రదర్శన అద్భుతం. వర్ణించనలవికానిది. ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. ఆ సభ దాసుగారిని లయ బ్రహ్మ అనే బిరుదునిచ్చి సత్కరించింది.

మైసూరు సంగీత దుర్గంపై దాడి: మైసూరు మహారాజ దర్బారులో విద్వాంసులను గుర్తించి సన్మానించడానికి ఒక పద్ద్హతి ఉంది. ఆ రాజాస్థానంలో తమ విద్య ప్రదర్శించి బహుమానం అందుకోవడానికి వచ్చిన విద్వాంసులు ముందుగా అక్కడి ఆస్థాన విద్వాంసుల వద్ద తమ విద్య ప్రదర్శించాలి. రాజావారు పరోక్షంలో ఆసీనులై ఆ ప్రదర్శనను ఆలకిస్తారు. పురస్కారానికి వచ్చిన విద్వాంసుడు ఆస్థాన విద్వాంసులను మెప్పించగలిగితే రాజ దర్శనం లభిస్తుంది. లేకపోతె వెనుతిరిగి పోవలసిందే. దాసుగారు, వారి అన్న పేరన్నగారు దర్బారు హాలులో ప్రవేశించేసరికి అక్కడ ఇరవైమంది సంగీత విద్వాంసులు తంబురాలు, వీణలు పెట్టుకుని ఉన్నారు. బక్షి (రాజావారి అంతరంగిక కార్యదర్శి) వచ్చి మీ సంగీత  విద్యను ఈ విద్వాంసుల వద్ద ప్రదర్శించండి. రాజావారు ఈ చెంతనే ఉన్నారు; వారు కూడా వింటారు. వారికి మీ గానం నచ్చితే రాత్రికి మీ హరికథ వింటారు అన్నారు.  నారాయణ దాసుగారి చేతిలో వీణ ఉంది. పేరన్నగారి చేతిలో తంబురా ఉంది. వారు దాసుగారిని వైణికుడు గానూ పేరన్నగారిని గాయకుడు గానూ గుర్తించారు. దాసుగారిని వీణ వాయించమని కోరారు. ఆయన వాయించగా పెదవి విరిచి, పేరన్నగారిని పాడమన్నారు. దానికికూడా పెదవివిరిచి ఆపమన్నారు. జరిగిన పొరపాటు అర్ధమైన దాసుగారు, చిరునవ్వుతో నేనుపాడుతాను వినండి అని వెంటనే ధన్యాసి రాగం ప్రారంభించేరు. దాసుగారి శారీరము బంగాళా అన్నివైపులనించీ ప్రతిధ్వనించసాగింది. ఇంతలో బక్షి లోపలినుంచి వచ్చి దాసుగారితో "అయ్యా, దొరగారు మీ పాటకు చాల సంతోషించేరు. రాత్రి ఎనిమిది గంటలకు మీ హరికథ వింటారు.", అని చెప్పారు.   

నారాయణ దాసుగారు హరికథను కమాచి రాగంలో ప్రార్ధనా గీతంతో ప్రారంభించేరు. రాజావారు వెంటనే యువర్ మ్యూజిక్ ఈజ్ వెరీ స్వీట్ అని  ఏకాగ్రతతో కధ ఆద్యంతం విన్నారు. దాసుగారు సంస్కృత తెలుగు భాషలలో గానం చేస్తూ, రాజావారికి అర్ధంయ్యేటట్టు ఎంతోవేగంగా ఇంగ్లీషులో తర్జుమాచేసి వినిపించారు. కధ పూర్తయిన వెంటనే బక్షి నారాయణ దాసుగారితో, దొరవారు మీ పాటకు ఎంతో సంతోషించారు. అంతేకాక ఇంత సుందరమైన పాటకుని ఇంతవరకు చూడలేదని సెలవిచ్చారు. మళ్ళీ ఎల్లుండి మీ హరికథను వినాలనుకుంటున్నారు అని చెప్పారు. అక్కడ ఆసీనులైన విద్వాంసులు  మీరు అసమాన ప్రతిభావంతులు అని శ్లాఘించారు. దాసుగారు మొదటిరోజు అంబరీష చరిత్రము ప్రదర్సించేరు. రెండవసారి గజేంద్ర మోక్షణము హరికథాగానం చేస్తుండగా పేరన్నగారి పాటవిని రాజావారు యువర్ మ్యూజిక్ లల్ల్స్ మీ టు స్లీప్ అని మెచ్చుకున్నారు. రెండవ హరికథ అయిన తరువాత బక్షి నారాయణ దాసుగారితో రాజుగారికి ఇంకా మీ పాట తనివి తీరలేదు. మైసూరులో సింహాసనము పైనుండి మీకు బహుమతులివ్వాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని దసరా ఉత్సవాలకి ఆహ్వానించమని చెప్పారు’, అని ఖర్చులకి పైకం అందచేసారు. రాజావారు మీరు బెంగుళూరు మీద రచించిన సీసపద్యం వ్రాసి ఇమ్మన్నారు అని వ్రాయించి పుచ్చుకున్నారు.

ఈ హరికధా ప్రదర్శనల తరువాత నారాయణ దాసుగారు రెండు సంగీత కచేరీలు చేసారు. అందులో మొదటిది మైసూరు దివాను గారి సభలో ఉన్నతోదోద్యుగల సమక్షంలో. రెండవది మైసూరు హైకోర్టు జడ్జిగారి క్లబ్బులో. ఆ రెండు కచ్చేరిలలోను దాసుగారి గానమాధుర్యానికి, శారీరానికి,  పెక్కు రాగాలాలపనకి అమోఘమైన ప్రసంసలు లభించాయి.

దాసుగారి మైసూరు సంగీత యాత్ర విశేషాలు ఇంతటితో ముగియలేదు. అసలు విశేషం, ఇంకొకలా చెప్పాలంటే దాసుగారికి ఇంతకూ మునుపెన్నడూ లభించని గౌరవం ఆ మరునాడు లభించింది. ఆ రోజు సాయంత్రం మైసూరు రాజాస్థాన విద్వాంసులు అందరూ దాసుగారి విడిదికి వచ్చారు. మీదగ్గర హిందుస్తానీ భైరవి రాగం నేర్చుకోమని రాజావారు ఆజ్ఞ ఇచ్చారు. ఆ రాగం మాకు నేర్పండి అని కోరారు. దాసుగారు వారు కోరినంత సేపూ ఆ రాగాలాపన చేసారు. వారు కూడా ఎంతో ప్రయత్నించారు కాని అది వారికి పట్టుబడలేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏ విద్వాంసులు అయితే అంతకు ముందు పరిక్షాధికారి హోదాలో దాసుగారిముండు కూర్చున్నారో వారే విద్యార్ధులుగా దాసుగారి వద్దకు రావడం. ఒక విద్వాంసుడి సంగీత పాండిత్యానికి, అసమాన ప్రతిభకి ఇంతకుమించిన సన్మానం ఏముంటుంది చెప్పండి? 

ఆ తరువాత మహారాజావారి ఆహ్వానం మీద దాసుగారు మైసూరు దసరా ఉత్సవాలకు తిరిగివచ్చారు. ఈ రెండవ సందర్శనలో దాసుగారు మార్కండేయ చరిత్ర హరికథను ప్రదర్శించారు. రాజావారికి దాసుగారి గానం, ముఖ్యంగా హిందుస్తానీ సంగీతం ఎన్ని సార్లు విన్నా తనివి తీరక, ఫోనోగ్రాఫులో రికార్డు చేసుకున్నారు. ఆస్థాన విద్వాంసునిగా రమ్మని ఆహ్వానించారు. దాసుగారు తనకు తాను ఏర్పరచుకున్న మర్త్యులను కాలువను అనే నియమం వలన రాజుగారిని నిరాశపర్చవలసి వచ్చింది.

బిరుదులు సన్మానాలు: దాసుగారికి అనేక పట్టణాలలో బ్రహ్మరధ సన్మానాలు జరిగాయి. బందరులో శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి అధ్యక్షతన జరిగిన విద్వత్సభ ఆయనకు హరికథా పితామహ అనే బిరుదును ప్రదానం చేసింది.

సుబ్రమణ్య అయ్యరు అనే సంగీత విద్వాంసుడు సువర్ణ ఘంటాకంకణము ధరించి విజయనగరం రాగా ఆయనను సన్మానించడానికి దాసుగారే సభ ఏర్పాటు చేసారు. ఆయనను మూడు లేదా నలుగు తాళాలలో పాడగలరా అని ప్రశ్నించారు. అయన నేను రెండు తాళాలలో పాడగలను. నాలా రెండుతాళాలలో పాడగలిగే విద్వాంసుడినే చూడలేదు. అలా ఎవరేనా పాడగలిగితే నా సువర్ణ ఘంటాకంకణాన్ని తీసివేస్తాను అన్నాడు. అప్పుడు దాసుగారు అయిదు తాళములలో పల్లవి పాడి చూపించేరు. ఆ పండితుడాశ్చర్యపోయి దాసుగారికి దాసోహం అని నమస్కరించాడు. ఆ సభ దాసుగారికి పంచముఖీ పరమేశ్వరుడు అనే బిరుదు ఇచ్చి సత్కరించింది.

1933 లో విశాఖపట్టణంలో ప్రభల లక్ష్మీనరసింహం గారి అధ్యక్షతన గొప్ప విద్వత్సభ జరిగింది. ఆ సభలో జయపురం మహారాజు విక్రమ దేవ వర్మ గారు దాసుగారికి సంగీత సాహిత్య సార్వభౌమ అనే బిరుదునిచ్చి సత్కరించారు.

1934 లో దాసుగారు కాశీయాత్ర చేసివచ్చి న తరువాత సంస్కృతంలో కాశీ శతకం రచించారు. అదే సంవత్సరంలో చల్లపల్లి జమిందారు శ్రీ రాజా అంకినీడు మల్లికార్జున ప్రసాద రావుగారు హరికథ చెప్పాలని ఆహ్వానించారు. ఆ సభకు గొప్ప గొప్ప విద్వాంసులను ఆహ్వానించారు. ఆ సభలో దాసుగారు హరికథ చెప్పడమే కాకుండా తన వీణా వాదన ప్రతిభను ప్రదర్శించారు. కుడి ఎడమ చేతుల సమ విషమ జాతుల వాయించుటే ఆ వీణా వాదన విశేషం. ఆ అనన్య సామాన్య ప్రతిభకు పండిత మండలి పరవశించింది. జమిందారుగారు స్వయముగా దాసుగారి కాలికి గండపెండేరమును తొడిగి తమ కళారసికతను చాటుకున్నారు.    

నభూతో నభవిష్యతి అయిన వాగ్గేయకారుడు: దాసుగారు రచించిన దశ విధ రాగ నవతి కుసుమ మంజరి  అనే సంగీత ప్రబంధము వారి వాగ్గేయ కార పటిమకు నిదర్శనము. ఇది తొంభై కర్ణాటక రాగాలమాలికలో రచించిన దేవీ స్తుతి. మొదటి సగము తెలుగులోనూ రెండవసగము సంస్కృతములోను రచించారు. డా: ఎస్. వి. జోగారావు గారు ఈ గ్రంధాన్నిసంగీత ప్రపంచమున హనుమంతుని సముద్ర లంఘనము వంటిది అని అభివర్ణించారు. (1975. శ్రీ ఆదిభట్ట నారాయణ దాస సారస్వత నీరాజనము. పు. 1285).

1938 లో దాసు గారు కన్యాకుమారి యందు అమ్మవారిని దర్శించుకొని ఆ పరమానుభుతితో పది వివిధ జాతులలో తొమ్మిదేసి పంక్తులకు తొమ్మిదేసి రాగముల చొప్పున అనగా 90 రాగములలో అమ్మవారి పరముగ అన్వర్ధమగునట్లు రాగనామనిర్దేశము చేయుచు సర్వతాళాత్మక పంచాజాత్యేక తాళముతో సుస్వరముగ వివరించిన దేవీ స్తవము. ఆరోహణ క్రమమున సాగిన ఆ తొంబది పంక్తులు చక్కని సంస్కృత రచన. అనంతరము అవరోహణక్రమమున సుస్వరముగ సాగిన తొంబది పంక్తులు మిశ్రభాషాత్మకములు.

“‘దశ విధ రాగ నవతి కుసుమ మంజరి సర్వ లక్షణసారసంగ్రహము. ఈ సంగీత ప్రబంధములో దశ విధ జాతులున్నవి. 1. సర్వ సంపూర్ణ రాగములు 2. సంపూర్ణ షాడవ రాగములు 3. షాడవ సంపూర్ణ రాగములు  4. సంపూర్ణ ఔడవ రాగములు 5. ఔడవ సంపూర్ణ రాగములు 6. శుద్ధ షాడవ రాగములు 7. షాడవ ఔడవ రాగములు 8. ఔడవ షాడవ రాగములు 9. శుద్ధ ఔడవ రాగములు 10. వక్ర రాగములు. ఈ పది జాతులలో మరల ఒక్కొక్క దానిలో తొమ్మిది స్వరసాహిత్య ఆవర్తములు ఉన్నవి. అనగా ఈ పది జాతులలో గల రాగముల మొత్తము (10 X 9 = 90) తొంబది. ఇదియే దశ విధ రాగ నవతి కుసుమ మంజరి అని నామముంచుటకు గల కారణము.

ఈ సంగీత కృతియందలి ప్రతి పంక్తిలో, ఆ పంక్తిని పాడవలసిన రాగము పేరు వచ్చునట్లు దాసుగారు కూర్చినారు. తొంబది పంక్తులు తొంబది రాగములలో పాడవలెను. ఆ తొంబది పంక్తులలో పాడవలసిన అ తొంబది రాగముల నామములను చమత్కారముగా చొప్పించి ముద్రాలంకార పద్ధతిలో రాగ నామ నిర్దేశము చేసినారు. ఉదాహరణకు మొదటిజాతిలోని తొమ్మిది రాగములు: 1. శ్రీధీరశంకరాభరణే 2. పాహిమామ్మహానటభైరవి 3. త్వమేవశరణం శ్యామలాంగి 4. సదామాం పాలయ సరసాంగి 5. సేవేంబత్వాం కీరవాణి 6. సంరక్షమాం  పతితపావని 7. భువనైకమొహన రూపవతి 8. సేవేత్వాం గాయకప్రియే 9. త్రిభువనజ్యోతి స్వరూపిణి.

 దశ విధ రాగ నవతి కుసుమ మంజరి సంగీత ప్రపంచమున ఉదయించిన ఏకైక భాను బింబము.” (1983. గుండవరపు లక్ష్మి నారాయణ. నారాయణ దర్శనము పు. 344-45)

దశ విధ రాగ నవతి కుసుమ మంజరి అనే ఈ సర్వ తాళాత్మక పంచజాత్యేక తాళ ప్రబంధమునకు పంచముఖి అనే పేరు దాసుగారే పెట్టారు. పంచముఖి పరమశివుని అయిదు ముఖాలను సూచిస్తుంది. ఆ అయిదు ముఖాలూ సద్యోజాత, వామదేవ, ఈశాన, తత్పురుష, అఘోర. పంచముఖి లోని అయిదు తాళములను ఒకేసారి అయిదు శరీరంగాములతో వేయవలెను: 1. త్రిస్రగతి : కుడి చేయి 2.  చతురస్రగతి: ఎడమచేయి 3.ఖండ: కుడిభుజము 4. మిశ్ర: ఎదమభుజము 5. సంకీర్ణ: శిరస్సు.    

దశ విధ రాగ నవతి కుసుమ మంజరి  రాగమాలికను ఆరవ తాళమున ప్రయోగించుటకు అనువుగా దాసుగారు ఈ రచన చేసారు. ఆరవ తాళమున అనుష్ఠించుటకు షణ్ముఖి అనియు సంగీత శాస్త్ర పరిభాషలో లఘుశేఖరము అని పిలుస్తారు.  

సంగీత శేఖర, మహా మహోపాధ్యాయ శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారు దశ విధ రాగ నవతి కుసుమ మంజరి పై ఈ విధంగా వ్యాఖ్యనించారు.

"ఈ రాగమాలికను ఒకరు పాడుచుండగా అయిదుగురు విద్వాంసులు ఒక్కొక్క ఏక తాళమున వేయుచుండిన రాగమాలిక మొదలుపెట్టి ముగించుసరికి అయిదు ఏకతాళములు ముగియును. మధ్యలో మాత్రము ముగియుట సాధ్యము కాదు. కాగా ఈ అయిదు తాళములు ఒకరే వేయుచు పాడుటకు అపూర్వ సాధన చేసినచో అది ఒక అద్భుత క్రియ అగును...ఈ ప్రబంధము అద్వితీయము. అపూర్వము. న భూతో న భవిష్యతి అనుట అతిశయోక్తి కాదు.

ఈ రాగమాలికను విద్యార్థులకు బోధించించో రాగమాలికలో మొదటి రాగమును నేర్చుకొనునప్పుడు విద్యార్ధిగానుండు వ్యక్తి 180 వ (ఆవర్తము) రాగము నేర్చి, పాడగలిగిన నాడు విద్వాంసుడుగా రూపొందు ననుట నిర్వివాదాంశము. ఆ మహామహునకు నా జోహారు."   

ఈ పంచముఖిని దాసుగారు రెండవసారి తమ సంగీత కళాశాల పధ్నాలుగవ వార్షికోత్సవ సందర్భమున (1-2-1933) సమగ్రముగా ప్రదర్శించారు. తలపై నిమ్మకాయ పెట్టుకొని అది కిందపడకుండ షణ్ముఖి తాళమును అధ్భుతముగా ప్రదర్సించేరు.

హరికథ సృష్టి

మానవాళికి భక్తీ, జ్ఞాన, మోక్షములను ప్రబోధించే ఉద్దేశంతో నారాయణ దాసు గారు హరికథ సృష్టి చేశారు. వారు హరికథను సర్వ కళల సమాహారం అని అభివర్ణించారు. నారాయణ దాసు గారు సృష్టించిన హరికథలో కథాప్రవచనము, ఆశుకవిత్వము, శాస్త్రీయసంగీతము, నృత్యం, అభినయం ప్రధానాంగాలు. సమయ, సందర్భాలను బట్టి వారు ప్రదర్శించిన హరి కథలలో సంగీత, సాహిత్య చర్చలు ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే, నారాయణ దాసు గారు, అంతకుముందు జానపద కళగా ఉన్న హరికథను సారస్వత సభల స్థాయికి, సంగీత కచేరిల ఉన్నత స్థాయికి చేర్చారు.  ఈ కళా రూపాన్ని సృష్టించిన నారాయణ దాసు గారు 17 తెలుగులోనూ, 3 సంస్కృతంలోను, 1 అచ్చతెలుగులోను, మొత్తం 21 హరికథలను రచించారు. వీటిలో దాసుగారి మొదటి హరికథ ద్రువచరిత్ర ప్రచురించబడలేదు కనుక అలభ్యము. అలాగే గోవర్ధనోద్ధారము కూడా అలభ్యము.  వీటిలో యదార్థ రామాయణము పేర రచించిన ఆరు శ్రీరామ కధల సంపుటీ, హరికథామృతము పేర రచించిన మూడు శ్రీ కృష్ణ కధల సంపుటీ మరియు  గౌరప్పపెండ్లి పేర రచించిన అచ్చతెలుగు హరికధా ఉన్నాయి. వారు రచించిన (ఉత్తర రామాయణ కథ) జానకీశపధం అనే హరికథ 36 అపూర్వ కర్నాటక సంగీత రాగాలతోగూడి, సంగీతపరంగా ఎంతో ప్రశస్తిపొందింది.  

హరికథ స్వరూప, స్వభావలెలా ఉండాలో వివరిస్తూ ఆయన ఆంధ్ర పత్రిక 1911 ఉగాది ప్రత్యెక సంచికలో హరికథ అనే వ్యాసం వ్రాసారు. అందులోనిది ఈ పద్యం:   

ఘన శంఖమో యన గంఠంబు పూరించి
మేలుగ శ్రుతిలోన మేళవించి
నియమము తప్పక నయ ఘనంబుల బెక్కు
రాగ భేదంబుల రక్తి గొల్పి
బంతు లెగిర్చిన పగిది కాలజ్ఞతన్
జాతి మూర్చన లొప్ప స్వరము పాడి
చక్కని నృత్యము సర్వరసాను కూ
లంబుగాగ నభినయంబు చేసి
స్వకృత మృదు యక్షగాన ప్రబంధసరణి
వివిధ దేశంబులం బిన్నపెద్దలు గల
పలు సభల హరిభక్తి నుపన్యసింప
లేని సంగీత కవితాభి మాన మేల

దాసుగారు అసమాన ఆశుకవితా ధురీణులు, అద్వితీయ శాస్త్ర, పురాణ పండితులు కనుక వారి హరికథా ప్రదర్శనలలో కధ సూత్రప్రాయంగా ఉన్నా సభా సదులను బట్టి విషయ సంగ్రహం మారుతూ ఉండేది. ఉదాహరణకు సభలో సాహితీ వేత్తలు ఉంటే అయన హరికథా వేదిక సాహిత్య సదస్సుగా మారేది; సంగీత విద్వాంసులు ఉంటే సంగీత శాస్త్ర చర్చ జరిగేది. ఒకసారి వారు రాజమండ్రీలో సీతాకల్యాణం హరికథ చెప్తూ సభికులలో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారిని గమనించేరు. సీతాదేవి దుర్గామాతకు పూజచేసే ఘట్టాన్ని వర్ణిస్తూ సంస్కృతంలో వ్యాఖ్యానం చేస్తూ పూజచేసే దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేరుట. సంస్కృత భాషా, వ్యాకరణాల మీద తనకున్న పట్టును తెలియచేయడమే అయన ఉద్దేశం. అందుకే చెళ్ళపిళ్ళ వారు ఆయనను పుంభావ సరస్వతి అని కీర్తించేరు. 

ఇక హరికథలలో అయన ప్రదర్శించిన నృత్యం ముగ్ధ మనోహరంగా భరతముని శాస్త్రానికి సజీవ ఉపమానంలా ఉండేది. స్వరాజ్య పత్రికలో 1933 లో వ్రాసిన వ్యాసంలో సుప్రసిద్ధ నాట్యాచార్యులు అర్ వి కె అప్పు గారు, నారాయణ దాసుగారి నాట్యకళా కౌశలాన్ని ఇలా ప్రసంసించేరు:

ఈనాడు భరత నాట్యమున ప్రవీణులైనవారు, ఆకళయొక్క జీవ కళను నిలుపనుత్సహించువారు అతి స్వల్పముగనున్నారు. అతి కొద్దిమందిలో విజయనగర సంగీత కళాశాల అధ్యక్షులైన శ్రీ నారాయణ దాసు గారొకరు. ఆయన స్వశక్తిచే 'లయబ్రహ్మ' బిరుదాంకితుడై వాసికెక్కారు. నృత్య కళావైయాత్యమున గూడ అయన లబ్ధ ప్రతిష్ఠుడు. ఆ నేర్పును తమ హరికధలన్నిటా చక్కగా వినియొగించుకొనెను.

ఇక నటన. హరికథలలొ వారు ప్రదర్శించిన నటనా వైదుష్యాన్ని తెలుసుకోవడానికి సుప్రసిద్ధ రంగస్థల నటులు స్థానం నరసింహారావు గారిని ఉటంకిస్తాను:

రంగస్థలాన నటించే మేమంతా, కవి వ్రాసిన నాటక పాత్రముల సంభాషణలను ... కంఠస్థం చేసుకుంటాం  మూడు నాలుగు గంటల కాలం వేషాలు వేసుకుంటాం. ఇంతచేసినా, ఎంత కష్టపడినా, ఒక్కొక్కప్పుడు మా పాత్రముల తత్వాలలో జీవించలేక మా వ్యక్తిత్వాలతో బయట పడుతూ ఉంటాము.

దాసుగారి విషయంలో అలా కాదు. అయన చెప్పేకధలోని అన్ని పాత్రముల్లోనూ అయన జీవిస్తాడు. అంతేకాక ఆడి, పాడి, మాటాడి అభినయిస్తూ తన పాత్రముల వెంట మన మనస్సును నడిపిస్తాడు. కాదు లాక్కొని పోతాడు. అయన హరిదాస వేషం మాత్రం మారదు. ఆ మీసాలూ, ఆ బొజ్జా, మెళ్ళో పూలమాలికా, నడుంకు కట్టిన సిల్కు ధోవతి, దానిపై చుట్టిన కుచ్చుగల కాశ్మీర్ జరీ శాలువ, కాళ్ళకు గజ్జెలు, చేతిలో చిడతలు అన్ని కనిపిస్తూనే ఉంటాయి. అందులోంచి వచ్చే అ పాత్రలనూ వాటి భావాలనూ మాత్రమే గమనిస్తూ ఉంటాం. 

ఆయన వాక్శబ్డంలోనూ, భావ ప్రకటనలోనూ, ఆంగిక చలనంలోనూ వినిపించే సీతా కళ్యాణంలో ఒక గంభీరుడైన రావణ బ్రహ్మ కనిపిస్తాడు. మహొదాత్తుదైన విశ్వామిత్ర మహర్షి కనిపిస్తాడు. నవమన్మధుడైన రామచంద్రుడు కనిపిస్తాడు. నవకోమల కన్యారత్నం సీతా, ఆమె చిరునగవు, సిగ్గు కనిపిస్తాయి ... అన్ని వేషాలు వేసి, మెప్పించే నటులకంటే అసలు వేషాలే ధరించకుండా వాటి మనస్తత్వాలను, మనముందు స్వభావసిద్ధముగా ప్రకటించడంలో అయన ప్రతిభ అసమానం. అద్భుతం. ఆనందప్రదం. అయన ఆత్మశక్తి అచంచలం. పాండిత్యం అపారం. అందలి అంతరార్ధం పరమార్ధం. భావప్రకటనలో అస్మదాదులకు ఆదర్శం. అందులకే ఆయన్ను మహానటుడని స్మరిస్తూ ఉంటాను.

సాహిత్య పరిచయం

నారాయణ దాసు గారు రచించిన గ్రంధాలలో ముఖ్యమైనవి: జగజ్జ్యోతి (వేదాంత గ్రంధం). నవరస తరంగిణి (కాళిదాసు, షేక్స్పియర్ నాటకాలలోని నవరసాల పోషణల తులనాత్మక ప్రదర్శనకు, అయన ఎంచుకున్న ఆయా రసాల ఘట్టాలను అచ్చతెలుగులోనికి అనువదించారు). రుబాయత్ అఫ్ ఒమర్ ఖైయం (ఒమర్ ఖైయం పర్శియను గీతాల ఇంగ్లీషు అనువాదాలు మూలానికి న్యాయం చెయ్యలేదని నారాయణ దాసుగారి విశ్వాసం. తన వాదనను ఋజూవు చెయ్యడానికి, పర్శియను మూలాన్ని, ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్ద్ ఇంగ్లీషు అనువాదాన్ని సంస్కృతం, అచ్చతెలుగు భాషలలోనికి అనువదించి తులనాత్మకంగా  ప్రదర్శించారు. 1932 లొ ముద్రించబడిన ఈ గ్రంధాన్ని, కేంద్ర సాహిత్య అకాడెమి గత సంవత్సరం పునర్ముద్రించింది.). తారకం (సంస్కృతంలో స్వతంత్ర కావ్యం. స్వాతంత్ర్యోద్యమానికి పరోక్షంగా వారు సూచించిన మధ్యే మార్గం కథావస్తువు. వేదాంత నేపధ్యం, పాణిని వ్యాకరణ సూత్రాలకు అనుబంధ ఉపయోగం ఈ కావ్య ప్రత్యేకతలు.). తల్లి విన్కి (లలితా సహస్రనామాలలోని ప్రతి నామానికీ అచ్చతెలుగు పద్యానువాదం). వెన్నుని వేయిపేర్ల వినకరి (విష్ణు సహస్రనామాలలోని  ప్రతి నామానికీ అచ్చతెలుగు పద్యానువాదం). ఋక్సంగ్రహం (ఈ గ్రంధానికి మ్రొక్కుబడి అనే నామాంతరం ఉంది. నారాయణదాసు గారు 304 ఋక్కులను ఎంచుకొని వాటిని ఆంధ్రీకరించి, సంగీతం సమకూర్చారు. అయన ఈ ఋక్కుల అనువాద పద్యాలను వీణపై వాయించేవారు.) రామచంద్ర శతకం, కాశి శతకం (సంస్కృత శతకాలు). 

పూర్ణ పురుషుడు

మహారాజ ఆంగ్ల కళాశాలలో కావ్యకంఠ గణపతి ముని (రమణ మహర్షి ఆయనకు నాయన అని పేరుపెట్టారు) కాళిదాసు కవితంపై ఉపన్యసించే విద్వత్సభ జరిగింది. ఆ సభకు తాతా సుబ్బరాయ శాస్త్రి గారు అధ్యక్షత వహించవలిసి ఉంది. కాని అనారోగ్య కారణంగా అయన రాలేక పోయారు. అధ్యక్ష స్థానంలో ఎవరిని కూర్చోపెట్టాలా అని అందరూ తర్జన భర్జన పడుతూ ఉంటే నారాయణ దాసుగారు ఆ గౌరవానికి తగినవారని 'నాయన' సూచించారు. అ సభలో 'నాయన' కాళిదాసు కవితారీతుల గురించి సుమారు రెండున్నర గంటలు సంస్కృతంలో అనర్గళంగా ప్రసంగించారు. దానితరువాత దాసుగారు కాళిదాసునూ గణపతి మునిని ప్రసంసిస్తూ సంస్కృతంలో ప్రసంగించారు. అప్పుడు  'నాయన', ‘దాసుగారు పూర్ణ పురుషుడు. ఆ మహనీయుని వాగ్ధాటికి అభివాదాలు అని మెచ్చుకున్నారు. 
ముగింపు
ఆనాటి సంగీత సాహిత్య ప్రపంచం నారాయణ దాసుగారికి సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వర మరియు హరికథ పితామహ లాంటి బిరుదులతో సన్మానించింది. వీటిలో లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వర బిరుదులు వారి అనన్య సామాన్యమైన తాళజ్ఞాన ప్రతిభకి గుర్తింపు. దాసు గారు ఒక కీర్తన గానం చేసేటప్పుడు రెండు చేతులతో రెండు తాళాలు, రెండు భుజాలతో రెండు తాళాలు, తలతో ఐయదవ తాళం వేయగలిగే వారట. ఈ ప్రజ్ఞనే పంచముఖి అంటారు.  ఈ ప్రజ్ఞను కూడా అధిగమించి నోటితో గానంచేసే కీర్తనను ఆరవ తాళంలో గానం చేయగలగడం షణ్ముఖి’. ఈవిధంగా అయిదు, ఆరు తాళాలతో గానం చేసే సంగీత విద్వాంసులు వేరొకరు లేరు; ‘నభూతో నభవిష్యతి అనడం అతిశయోక్తి కానే కాదు.  

నారాయణ దాసుగారు ఎనభయ్యవ పడిలో ప్రవేసించేక భారతి తీర్థ అనే సాంస్కృతిక సంస్థ వారిని సన్మానించి బిరుదప్రదానం చేయాలని ఆహ్వానించింది. అప్పటికే ఆయనకు ఎన్నో సన్మానాలు,  బిరుదప్రదానాలు జరిగాయి. అంతవరకూ అందుకున్న బిరుదులన్నీ సంస్కృతంలో ఉన్నాయి కనుక ఈసారి ఆ సంస్థ ప్రదానం చేసే బిరుదు తెలుగులో ఉండాలని కోరేరుట శ్రీ దాసు గారు. సంస్కృతంలో గొప్ప పండితుడైన నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానం అలాంటిది. ఈ పద్యం ఆయన తెలుగు భాషాభిమానాన్ని విశదీకరుస్తుంది:

మొలక లేత తనము తలిరుల నవకము
మొగ్గ సోగతనము పూవు తావి
తేనే తీయదనము తెలుగునకే కాని
మొరకు కరకు దయ్యపు నుడికేది?

నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానాన్ని గౌరవించి భారతి తీర్థ, ‘ఆట పాటల మేటి అనే (తెలుగు) బిరుదుని ప్రదానం చేసి గౌరవించింది.

ఆ మహనీయుడు తెలుగు జాతికి అధ్బుతమైన, అనన్య సామాన్యమైన, అనితర సాధ్యమైన, అజరామరమైన సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారు. వారు భారతీయ సాహిత్య, సంగీత కళా రంగాలకు చేసిన సేవలకు గుర్తుగా ఈ 150వ జయంతి సంవత్సరంలో వారిని సంస్మరించుకోవడం ప్రతి భారతీయుడి, ప్రత్యేకంగా తెలుగువాడి కనీస కర్తవ్యం.  

ఇంకా చదవాలంటే:

ఆదిభట్ల నారాయణ దాసు. 1979. దశ విధ రాగ నవతి కుసుమ మంజరి. దాస భారతి ప్రచురణలు. గుంటూరు

ఆదిభట్ల నారాయణ దాసు. 2012. నా ఎరుక.  మోదుగుల రవికృష్ణ (సం.) మిత్రమండలి ప్రచురణలు. గుంటూరు.

ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి. 2005. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు. భారతీయ మార్గము. సంపుటి 6. సంచిక 3. జనవరి 2005. పు. 13-16

ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి. 2007. సకలకళా విశారదుడు హరిదాస జగద్గురువు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు. రసమయి. సంపుటి 7. సంచిక 5. ఫిబ్రవరి 2007. పు. 12-18

ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి. 2012. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి నాట్యకళా వైదుష్యం. జ్యోతిర్వాస్తు విజ్ఞానం. సంపుటి 10. సంచిక 6. మే 2012. పు. 9-12

ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి. 2013. హరికథా పితామహుని స్మృతిలో…!. ఋషిపీఠం. సంపుటి 15 సంచిక 2. సెప్టెంబరు 2013. పు. 63-66

కర్రా ఈశ్వర రావు. 2008. జనహృదయ సుధ - హరికథ. ఋషిపీఠం విశిష్ట సంచిక 2008. పు. 219-223

గుండవరపు లక్ష్మీనారాయణ. 1983. నారాయణ దర్శనము. (ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు పి. ఎచ్ డి. పరిశోధన వ్యాసము) 

మహాభాష్యం నరసింహ రావు. హరికధలిచ్చిన అపరసరస్వతి. ఋషిపీఠం

యామిజాల పద్మనాభ స్వామి. 1979. పూర్ణపురుషుడు (రెండవ సంకలనం). జాన్సన్ పబ్లిషింగ్ హౌస్. గుంటూరు. 

వైజర్సు బాలసుబ్రహ్మణ్యం. 2012. The Musical Genius of Harikatha Pitamaha Sri Adibhatla Narayana Dasu Garu. Kalatapasvi Creations. Chennai.

శ్రీ ఆదిభట్ల నారాయణ దాస శతజయంత్యుత్సవ సంచిక. 1967. సంస్కృతి సమితి. చీరాల

శి. వేం. జోగా రావు. (సం). 1976. ఆదిభట్ల నారాయణదాస సారస్వత నీరాజనము. రచయితల సహకార సంఘము. గుంటూరు.

A.  Ramalinga Sastry. A colossus who hallowed Harikatha. The Hindu. July 29, 2002     http://hindu.com/thehindu/mp/2002/07/29/stories/2002072900870200.htm

G. S. 2007. Great Exponent Revisited. The Hindu (Friday Review). September 14, 2007. p.3

Upadhyayula Narayana Das. 2012. Srimadajjada Adibhatla Narayana Das. Tirumala Tirupathi Devasthanams Yuva Layam South Indian Youth Music Festival Souvenir. p. 55-61




No comments:

Post a Comment