వార్తా
ప్రసార మాధ్యమాలు ఆధునీకరించబడిన తరువాత, విస్తృతమై అందరికీ సాంఘిక ప్రసార మాధ్యమాలు
అందుబాటులోకి వచ్చాయి. అయితే మానవ సాంఘిక జీవనంలో సంభవించే చాలా మార్పులు మంచివీ పురోభివృద్ధికారకాలే
అయనా ఒక్కొక్కప్పుడు కొన్ని దుష్ఫలితాలకు కారకాలు కావచ్చు. అందులో మొదటిది అసత్య వ్యాప్తి.
అదుగో అలాటి ఒక అసత్య వ్యాప్తి కారణంగా ఇది వ్రాయవలసి వచ్చింది.
ఇంతకీ ఆదిభట్ల నారాయణ దాసు గారి అసలు వారసులెవరు? “విజయానికి అందరూ కర్తలే; పరాజయం అనాథ” అని ఒక ఆంగ్ల సామెత! ఏదేనా విజయం సాధించిన వారితో ఏదో ఒక సంబంధం అపాదించుకోవడం మానవ నైజం. "ఆయనదీ మ ఊరే!"; "ఆయన మాకు దూరపు బంధువు"; "ఆయన నేను ఒకే పాఠశాలలో చదువుకున్నాము, ఒకే తరగతిలో కాకపోయినా" ఇలాంటివి ఎన్నో వింటూంటాము. కాని అసలు వారసులు ఉండగా, వారి ఉనికి గురించి తెలిసికూడా నేనే వారసుడిని అనిపించుకోవడం సమంజసం కాదు. "ఆ మహనీయుడు జన్మించిన గ్రామంలోనే నేను కూడా జన్మించాను" లేదా "మా ఇంటిపేర్లలో కూడా సామ్యం ఉంది" అనడానికీ "నేనే ఆయనకి మనుమడిని లేదా మునిమనుమడిని" అనడానికీ తేడా లేదా? అది సమంజసమా? అసత్య ప్రచారం కాదా?
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి ఏకైక కుమార్తె సావిత్రి ఆమె భర్త ఉపాధ్యాయుల అప్పలనరసయ్య |
అంతేకాక
సౌరాష్ట్ర దేశం నుండి తమిళనాడులోని వెలంగమాన్ (తంజావూరు జిల్లా), అక్కడ నుండి పేరూరు
(తూర్పు గోదావరి) వరకూ ద్రావిడ బ్రాహ్మణుల వలసలు; తమ వంశ మూల పురుషుడు ఆదిభట్టు నుండీ
తనవరకూ తమ వంశచరిత్రను పద్యమాలికరూపంలో ఆదిభట్ల నారాయణ దాసు గారే వ్రాసారు. ఇంక ఈ విషయాలపై
ఎటువంటి సందేహాలకూ తావు లేదు. ఈ పద్యమాలిక అయన రచించిన "జగజ్జ్యొతి", శ్రీ S V
జోగారావు గారి సంపాదకత్వంలో వెలువడిన "శ్రీ
ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనము" గ్రంథాలలో ప్రచురించబడింది.
ఉపాధ్యాయుల
అప్పల నరసయ్య గారు సింహాచలం దేవస్థానం కార్యాలయాలలొ కార్యనిర్వహక పదవిలో ఉండేవారు.
మనుమడు సూర్యనారాయణ రావు రచయిత, నాటకకర్త,
పత్రికా రచయిత, పత్రికా సంపాదకుడు. ఆయన “Indian Express”, “ఆంధ్ర ప్రభ” పత్రికలకు విలేఖరిగా, “The Advertiser” పత్రికకు
సహాయ సంపాదకుడిగా పనిచేసారు. తెలుగులో మొట్టమొదటి సంగ్రహ (digest)
పత్రిక "నవనీతం" స్థాపించారు.
"పంకజాక్షి", "కాబూలీవాలా" (అనువాద నాటకాలు),
"మొపాసా కథలు" (అనువాద కథల సంపుటి),
"విజయనగరవైభవం" (స్వతంత్ర నాటకం)
రచించారు. మనుమరాలు శ్యామలా దేవి విద్యాభ్యాసం ఇంటిలోనే జరిగింది. ఆమె గాయకురాలు, వైణికురాలు.
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి మనుమడు ఉపాధ్యాయుల సూర్యనారాయణ రావు ఆయన భార్య కామేశ్వరమ్మ |
మీ సమాచారం కోసం ఆదిభట్ల నారాయణ దాసు గారి ఆయన ఆరవ తరం వరకూ
(2020 నాటికి)
రచించబడిన వంశవృక్ష పట్టిక ఈ కింద ఇస్తున్నాను. ఈ పట్టిక డా. అయలసోమయాజుల గోపాలరావు గారు రచించిన "ఆట - పాట - మాట - మీటల మేటి శ్రీ ఆదిభట్ల" (2020) గ్రంథం 201వ పేజీలో పొందు పరిచారు.
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి మనుమరాలు శ్యామలాదేవి ఆమె భర్త కర్రా ఈశ్వరరావు |
ఆదిభట్ల నారాయణ దాసు గారు 1945వ సంవత్సరంలో శివైక్యం చెందారు. ఆయన తెలుగులో, సంస్కృతంలో అచ్చతెలుగులో సుమారు 55 గ్రంథాలు రచించారు. ఆయన రచించిన గ్రంథాలన్నిటికీ ఆయన అల్లుడు ఉపాధ్యాయుల అప్పలనరసయ్య కొన్ని సంవత్సరాలు శ్రమించి శుద్ధ ప్రతులను తయారు చేసారు. ఆదిభట్ల నారాయణ దాసు గారి నిర్యాణాంతరం అల్లుడు ఉపాధ్యాయుల అప్పలనరసయ్య, మనుమడు సూర్యనారాయణ రావు ఇంకొంతమంది ప్రముఖులతో "శ్రీ ఆదిభట్ల నారాయణ దాస అముద్రిత గ్రంథ ప్రచురణ సంఘం" (Sri Adibhatla Narayana Das’ Unprinted Works Publication Committee) అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి ఆయన గ్రంథాల ముద్రణకు ఎంతో కృషి చేసారు. ఆ విధంగా "జగజ్జ్యొతి" అనే సుమారు 1000 పేజీల, రెండు సంపుటాల బ్రృహద్గ్రంథం వెలుగు చూసింది. ఉపాధ్యాయుల అప్పలనరసయ్య గారు 1964లో మరణించారు. అదే సంవత్సరం అప్పలనరసయ్య గారి అల్లుడు శ్రీ కర్రా ఈశ్వర రావు గారు (ఆదిభట్ల నారాయణ దాసు గారి దౌహిత్రి శ్యామలా దేవి భర్త) ఆదిభట్ల నారాయణ దాసు గారి శతజయంతి సంస్మరణ ఉత్సవాలను చీరాలలో ఘనంగా నిర్వహించారు. ఆ సభల స్మారక సంచికగా ప్రచురించిన "శ్రీ ఆదిభట్ల నారాయణ దాస శతజయంత్యుత్సవ సంచిక" (1967), సాహిత్య, సంగీత కళా రంగాలలో అనేక మంది విద్వాంసులు రచించిన వ్యాసావళితో సాహిత్య, సంగీత ఔత్సాహికులకు, పరిశోధనా విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైన గ్రంథం. ఆప్పటినుండి ఆదిభట్ల నారాయణ దాసు గారి సాహిత్య ప్రచురణ, ప్రసార బాధ్యతలను శ్రీ కర్రా ఈశ్వర రావు గారు తన భుజస్కందాలపై వేసుకుని వ్రాతప్రతులు లభ్యమైన అన్ని గ్రంథాలను ప్రచురించారు. ఆ ప్రచురణ, ప్రసార యజ్ఞాన్నిశ్రీ ఈశ్వర రావు గారు సుమారు 37 సంవత్సరాల పాటు 2001వ సంవత్సరంలో తన నిర్యాణం వరకూ కొనసాగించారు. అందులో శ్రీ S V జోగా రావు గారి సంపాదకత్వంలో 1975లో వెలువడిన 1340 పేజీల "శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనము" సాహిత్య, సంగీత పరిశోధనా విద్యార్థులకు అత్యంత ఉపయుక్తమైన గ్రంథము. ఈ పుస్తకంలోని సమీక్షా వ్యాసాలను అయా విషయాలలో, రంగాలలో నిష్ణాతులైన విద్వాంసులు సమగ్రంగా రచించారు.
శ్రీ
కర్రా ఈశ్వర
రావు గారు
1970 లలో స్థాపించిన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస కథా గాన కళా పరిషత్ ఆనాటినుండి నేటి వరకు
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఆ సభలలో
అనేక మంది కవిపండితులను, సంగీత విద్వాంసులను హరికథకులను అతిథులుగా, వక్తలుగా, ప్రవక్తలుగా,
గాయకులుగా, హరికథకులుగా పాల్గొనడానికి పరిషత్ ఆహ్వానించింది.
చివరగా
ఒక మాట: శ్రీఆదిభట్ల నారాయణ దాసు గారి గ్రంథ ప్రచురణ, ప్రసరణ జరిగిన మొదటి 56
సంవత్సరాలలో (1945-2001) ఆయన
కుటుంబ సభ్యులు
కానివారెవరూ మేము
వారసులము అని
ముందుకు రాలేదు.
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస కథా గాన కళా
పరిషత్ కార్యకలాపాలవలన ఆయన ప్రతిభా పాటవాలు ప్రకాశించి, విస్తరించిన తరువాత మొదట
“మేము కూడ ఆదిభట్ల వారమే; మాది కూడ అజ్జాడే" అని; తరువాత “మేమే అసలైన వారసులమ”ని
కొంతమంది చెప్పుకుంటున్నారు. ఇది అవాంఛనీయము, అన్యాయము. ఇటువంటి అసత్యాలను ప్రోత్సహించ
కూడదు.
ఇక అజ్జాడ
గ్రామం విషయం: శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే బ్రృందావనం (మథుర) విడిచి ద్వారకకు వెళ్ళిన
తరువాత తిరిగి మథురకు రాలేదు. అలాగే నారాయణ దాసు గారు 13
సంవత్సరాల వయసులో అజ్జాడ నుండి విజయనగరం వచ్చిన తరువాత తిరిగి అజ్జాడ వెళ్ళినట్టు ఎక్కడా
ఆధారాలు లేవు.
ఆయన 68
సంవత్సరాల సుదీర్ఘ సాహిత్య, సంగీత జైత్ర యాత్ర విజయనగరంలో, ఇప్పుడు నేను మీకు లేఖ రాస్తున్నఈ
ఇంటినించే సాగింది. అయన పరమపదించింది ఈ ఇంటిలోనే. ఆయన ఏకైక కుమార్తె, ఆమె సంతానం, కుమారుడు,
కుమార్తె వారి సంతానం జన్మించింది ఈ ఇంటిలోనే. ఆ కుటుంబ సభ్యులలో కొంత మంది మరణించింది
కూడ ఈ ఇంటిలోనే. క్రిందటినెల 24న
మా అమ్మగారు ఆదిభట్ల నారాయణ దాసు గారి మనుమడు శ్రీ సూర్యనారాయణ రావు గారి భార్య కామేశ్వరమ్మ
పరమపదించారు.
“శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్” అనే
సంస్థను స్థాపించి శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి అయిదవ తరం వారసుడు ఉపాధ్యాయుల లలిత్ నారాయణ్ తనయుడు
ఉపాధ్యాయుల ఆనంద నారాయణ దాసు 2014
నుంచీ శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి జయంతి, వర్ధంతి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
ఆ సంస్థ కార్యనిర్వహణ కేంద్రం ఈ ఇల్లే.
శ్రీ
సర్వారాయ హరికథా పాఠశాల (కపిలేశ్వరపురం) వ్యవస్థాపకులు, (కీ. శే.) ఎస్ బి పి బి కె
సత్యనారాయణ రావు గారి స్ఫూర్తితో (కీ. శే.) శ్రీ ఎస్ కె జగన్నాధ రావు ప్రభృతులు విజయనగరంలో
1984 లో “శ్రీ
ఆదిభట్ల ఆరాధనోత్సవ సంఘం” స్థాపించారు. ఆ సంస్థ (ప్రస్తుత కార్యదర్శి డా. అయలసోమయాజుల
గోపాల రావు) ప్రతి సంవత్సరం జరిపే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఈ ఇంటిలో శ్రీ అదిభట్ల
నారాయణ దాసు గారి చిత్ర పటానికి పుజాదికాలు నిర్వహించి, నగర సంకీర్తనంతో ప్రారంభించి
నిర్వహిస్తారు.
No comments:
Post a Comment