Showing posts with label Haasyam. Show all posts
Showing posts with label Haasyam. Show all posts

Wednesday, June 10, 2015

హరికథ​లలో చమత్కారం

బయటనుంచి సేకరించిన 'జోకులు' హరికథా ప్రవచనంలో చొప్పిస్తే ఆ ప్రవచనం అతుకుల బొంతలా కృతకంగా ఉంటుంది. హాస్యం అనేది సందర్భంలోంచి, కథలోంచి స్వాభావికంగా ఉద్భవించాలి కాని అతికించినట్టుగా ఉండకూడదు. సహజ పాండిత్యం లాగానే హాస్యం పండించడంలో కూడా నారాయణ దాసుగారికి తనదయిన ముద్ర ఉంది. ఆయన హాస్య స్పూర్తికి ఉదాహరణలు ఈ ఉదంతాలు: 

తనవద్ద హరికథా శిక్షణ కోసం వచ్చిన శిష్యులకు కథా ప్రవచనం, సంగీతం, నాట్యం మొదలైన అంశాలలో గురుకులం (అయన ఇంటిలోనే) శిక్షణ ఉండేది. (కులంతో సంబంధం లేకుండా ప్రతిభ ప్రాతిపదికగానే అంటే కొన్ని ప్రాధమిక అర్హతలు ఉన్నవారిని అయన శిష్యులుగా చేర్చుకునేవారు.) శిష్యులలో సభాపిరికితనం పోగొట్టడానికి వారిని తన హరికధా ప్రదర్శనలకు తీసుకువెళ్ళి,  ప్రదర్శనలలో వారికి చిన్న, చిన్న ప్రవచన అవకాశాలు కల్పిస్తూ ఉండేవారు. ముఖ్యంగా కీర్తనలు ఆలపించేటప్పుడు కొంత తాను పాడి మిగిలినది శిష్యులకు వదిలి పెట్టేవారు. 

ఒకసారి హరిశంద్రోపాఖ్యనం హరికథ చెప్పేటప్పుడు (స్మశానంలో) చంద్రమతి విలపించే ఘట్టంలో ఒక కీర్తన కొంత తను పాడి మిగిలిన భాగం తనతో వచ్చిన శిష్యుడిని పాడమన్నారు. ఆ శిష్యుడి ఆలాపనలో శ్రుతి తప్పింది. అది గమనించిన దాసుగారు ముందుకు వచ్చి ఏడిచేటప్పుడు శ్రుతి, లయ చూసుకునిరాగాలు కట్టి మరీ ఏడుస్తాముటండీఏడిచేటప్పుడు అన్నమ్మ రాగాలు వస్తాయి అని చమత్కరించారు.

మొదట్లో అంటే నారాయణ దాసుగారి కాలంలో వివాహాలలో వినోద (భక్తీవిజ్ఞాన) కాలక్షేపానికి హరికథలు ఏర్పాటు చేసేవారు.  తరువాత  శాస్త్రీయ సంగీత కచేరీలుఇంకొన్నాళ్ళకి సినిమా సంగీత కార్యక్రమాలుఇప్పుడయితే పాప్ మ్యూజిక్ కార్యక్రమాలుసినిమా తారల 'దర్శనాలువాడుకలోకోచ్చాయి.

కృష్ణారావు గారనే గృహస్తు ఇంట్లో వివాహ సందర్భంగా నారాయణ దాసు గారి రుక్మిణి కళ్యాణం హరికథ ప్రదర్సన ఏర్పాటయింది. మండు వేసవిపట్టపగలు ప్రదర్సన. అప్పట్లో విద్యుత్ పంఖాలు లేవు. దానికి సదుపాయంగా మనిషిని పెట్టి విసనకర్రతో విసిరిస్తానని గృహస్తు అంగీకరించారు. అయితే పనుల వత్తిడి వల్ల మరిచిపోయాడాయన. శరీరం అలిసేలా నర్తించే ప్రదర్శనలో చెమట ధారాపాతంగా కారుతుంది. కండువాతో చెమట తుడుచుకుంటూ దాసుగారు హరికధ ప్రదర్శిస్తూనే ఉన్నారు.  

 హరికధలో రుక్మిణి శ్రీకృష్ణునికి సందేశం పంపిన తరువాతశ్రీకృష్ణుని ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని మధనపడే సన్నివేశంలో  "నీవేమి తలచితివో కృష్ణా...” అనే కీర్తన పాడుతున్నారు.  సమయానికి హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్న కృష్ణారావు గారిని గమనించి దాసు గారు  చరణాన్ని పదే పదే పాడడం మొదలుపెట్టారు. విషయం అర్ధమయిన కృష్ణారావుగారు అయ్యా క్షమించాలి ఇదుగో మనిషిని పంపిస్తాను అన్నారు. అప్పుడు దాసుగారు దానికేముంది   విసనకర్ర నాముఖాన పడేయండి నేనే విసరుకుంటాను పక్కన నిలపడితే మీకు కూడా విసరుతాను అని చమత్కరించారు.